
వ్యాపారం..రాజకీయం కలగలిసి పోయిన చోట ఒప్పందాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మోదీ ఎప్పుడైతే ప్రధానమంత్రిగా కొలువు తీరాడో ఆనాటి నుంచి నేటి దాకా ఈ దేశంలోని ప్రధాన వనరులన్నీ ముగ్గురు చేతుల్లోకి వెళ్లి పోయాయి. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటి వరకు ఒక్క గాలి మాత్రమే మిగిలి ఉంది. అన్నీ వ్యాపార పరిధిలోకి వెళ్లి పోయాయి. దానిని కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు. ఈ దేశంలో ప్రధానంగా రిలయన్స్ అంబానీ, అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ, రతన్ టాటా సారథ్యంలోని టాటా గ్రూపులు కీలకంగా ఉన్నాయి. ఇవాళ దేశ రక్షణ రంగానికి సంబంధించి కూడా కాంట్రాక్టు పొందింది గౌతమ్ అదానీ గ్రూప్. తను వెళ్లని చోటు లేదు. కారణం తను ఏది చెబితే అది విని వెంటనే నిర్ణయం తీసుకునే వ్యక్తి పీఎం సీటులో ఉండడం. టాటాను పక్కన పెడితే అంబానీ, అదానీ ఇద్దరూ పోటా పోటీగా నువ్వా నేనా అంటూ దూసుకు వెళుతున్నారు. ఒకరిని మించి మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ భారత దేశ ఆర్థిక సామ్రాజ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకప్పుడు ఉచితంగా దొరికే మంచి నీళ్ల దగ్గరి నుంచి నేడు వాడుకునే ప్రతి వస్తువు కార్పొరేట్ మయంగా మారింది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక అసలు విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ. కారణం ఏమిటంటే దేశ క్రీడా రంగాన్ని శాసిస్తూ వస్తున్న ఏకైక క్రీడా సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తో బిగ్ డీల్ కుదుర్చు కోవడం విస్తు పోయేలా చేసింది. ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం కలిగిన సంస్థగా దీనికి పేరుంది. బీసీసీఐ ఏది చెబితే దానిని ఐసీసీ ఆచరించి తీరాల్సిందే. ఎందుకంటే వేల కోట్ల నుంచి లక్షల కోట్ల వ్యాపారానికి విస్తరించింది. ఇది పక్కన పెడితే తాజాగా రిలయన్స్ సంస్థ తేనీటి పానియం క్యాంపా కోలా పేరుతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో శీతల పానియాల వ్యాపారం లక్ష కోట్లకు పైమాటే . ఇందులో అత్యధిక భాగం విదేశీ కంపెనీలదే హవా. ఆ మధ్యన దేశీయ పానీయం రస్నా వచ్చింది. దాని దెబ్బకు కార్పొరేట్ కంపెనీలు విల విల లాడాయి. ఆ తర్వాత తెలివిగా మార్కెట్ ను తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. తమ గుప్పిట్లోకి తెచ్చేసుకున్నాయి.
ఇక రిలయన్స్ ప్రవేశించని రంగం అంటూ లేదు. టెలికాం రంగంలో తనే టాప్. ఆయిల్ రంగంలో కూడా. లాజిస్టిక్ , ఫ్యాషన్ , దుస్తులు, తదితర రంగాలలో ముందంజలో కొనసాగుతోంది. తాజాగా పానియాల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది రిలయన్స్. ఇప్పటికే క్యాంపా దుమ్ము రేపుతోంది. ప్రతి సామాన్యుడికి చేరువ కావాలనే ఉద్దేశంతో దీనిని ప్రవేశ పెట్టింది. కేవలం రూ. 10 కి అందిస్తోంది. తన మార్కెట్ వాటాను పెంచు కోవాలని చూస్తోంది. ఇప్పటికే మార్కెట్ ను చుట్టేసింది. ఇక పానియాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల దాకా పానియాలు తాగని వారంటూ ఉండరు. దీనినే గమనించారు ముఖేష్ అంబానీ . ఓ అడుగు ముందుకు వేశారు. కోట్లాది భారతీయులను ప్రభావితం చేసే క్రికెట్ ను ఎంచుకున్నారు. బీసీసీఐతో భారీ ఒప్పందాన్ని చేసుకున్నారు. అయితే ఎంతకు తీసుకున్నారనేది ఇంకా బయటకు వెళ్లడించలేదు. ఈ దేశంలో ఆడే అన్ని సీరీస్ లకు ప్రధాన భాగస్వామిగా ఉండనుంది. ఇప్పటికే ఐసీసీతో బహుళ జాతి సంస్థలు కోకా కోలా, పెప్సీ కోలా ఒప్పందం కలిగి ఉన్నాయి.
వీటి ఆధిపత్యానికి గండి కొట్టేందుకు సులువైన మార్గం ఎంచుకున్నారు అంబానీ. పురుషుల జట్టుతో పాటు మహిళ జట్టులకు క్యాంపా కోలా స్పాన్సరర్ గా ఉండబోతోంది. తాజా సీజన్ లో క్యాంపాతో పాటు ఆటంబర్గ్ టెక్నాలజీస్ కూడా ఉండనున్నాయంటూ బీసీసీఐ ప్రకటించింది. వచ్చే 2026 వరకు ఈ సంస్థలు ఒప్పందం కలిగి ఉంటాయి. దీని వెనుక మతలబు ఏమిటంటే క్రికెటర్లు కూడా క్యాంపా కోలాకు మద్దతు ఇస్తారు. జర్సీలు కూడా అవే ఉంటాయి. మొత్తంగా మార్కెటింగ్ స్ట్రాటజీ నిగూఢంగా పని చేస్తుంది. ఒప్పందం కోట్లల్లో ఉండవచ్చు. కానీ క్రికెట్ తో అనుబంధం కావడంతో అంబానీ కంపెనీకి అత్యధికంగా ఆదాయం సమకూరే ఛాన్స్ ఉంది. మొత్తంగా రిలయన్స్ ప్లాన్ వర్కవుట్ అవుతుందని అనుకోక తప్పదు. ఆ ఆదాయం ప్రతి ఏటా రూ. 10 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. వ్యాపారం అంటే ఒకచోట ఉండడం కాదు వినియోగదారుల ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లను ఒడిసి పట్టు కోవడం. అక్కడే విజయ వ్యాపార సూత్రం దాగి ఉంది. దీనినే ఫాలో అవుతోంది రిలయన్స్.