
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడి పోయినా జల వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. దీనికి రాజకీయాలు తోడు కావడంతో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో రాద్దాంతం చోటు చేసుకునేందుకు కారణమైంది బనకచర్ల ప్రాజెక్టు. ఈ పంచాయితీ సవాళ్ల దాకా, సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. తెలంగాణ ప్రాంతం ద్వారా ప్రవహించే గోదావరి నది నుంచి నీళ్లను రాయలసీమకు తరలించేందుకు తయారు చేసిందే ఈ జలాశయం. ఇది పూర్తిగా తమ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందంటూ తెలంగాణ ఆందోళన చెందుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో వివక్షకు గురైనందు వల్లనే కొన్నేళ్లుగా పోరాటం చేయాల్సి వచ్చిందని, అందుకే రాష్ట్రం ఏర్పడినా ఇంకా నీళ్ల దోపిడీ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేధావులు, రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు.
గోదావరి నుంచి తాము అక్రమంగా నీళ్లు తీసుకు వెళ్లడం లేదంటున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. వృధాగా ప్రతి ఏటా పెద్ద ఎత్తున సముద్రంలోకి వెళుతున్నాయని, వాటినే తాము తీసుకు వెళతామని స్పష్టం చేశారు. మొత్తంగా గోదావరి పరివాహక ప్రాంతం ద్వారా ప్రవహించే 200 టీఎంసీల నీళ్లను వాడుకుంటామని ప్రకటించారు. ఇందుకు ఎందుకు అభ్యంతరం చెప్పాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయనతో పాటు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సైతం ఇదే వాయిస్ వినిపిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ సీఎం కేసీఆర్ సీరియస్ గా స్పందించారు. ఏపీ నీళ్ల దోపిడీకి పాల్పడుతోందని ,దీనిని అడుగడుగునా అడ్డుకోవాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో చంద్రబాబుకు అనుకూలమైన కాంగ్రెస్ సర్కార్ ఉండడం వల్లనే కుట్రకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
బనకచర్ల ప్రాజెక్టు ఏపీకి వరంగా మారితే తెలంగాణ ఎడారి అవుతుందని, ఇక్కడి ప్రాంతం సాగు, తాగు నీటికి ఇబ్బంది ఏర్పడుతుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాజీ మంత్రి హరీశ్ రావు వివరాలతో సహా వెల్లడించారు. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ సైతం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తటస్థ వైఖరిని అవలంభిస్తుండడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ జలాశయం ముమ్మాటికీ ఈ ప్రాంత ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉందంటూ పెద్ద ఎత్తున ఆందోళన నెలకొనడంతో సర్కార్ మాట మార్చింది. దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయంటూ కేంద్రానికి లేఖ రాసింది.
ఇదే సమయంలో ఏపీ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ). పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ ను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇది నీటి వాటాకు, ప్రత్యేకించి ఇరు రాష్ట్రాల నీటి వినియోగానికి సంబంధించిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇదే సమయంలో పర్యావరణ అనుమతి కూడా లేదని వెల్లడించింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దీనికి ఆమోదం తెలుపుతూ సంతకాలు చేశారంటూ మండిపడ్డారు ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో చర్చలు జరిపింది.
బనకచర్ల వివాదం అటు ఏపీకి ఇటు తెలంగాణకు తలనొప్పిగా తయారైంది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. మరో వైపు జగన్ రెడ్డి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను మళ్లించేందుకు ఏపీ సర్కార్ భారీ స్కెచ్ వేసిందంటున్నారు ప్రముఖ నీటి పారుదల నిపుణులు వి. ప్రకాష్, శ్రీధర్ దేశ్ పాండే. వరద జలాల పేరుతో గోదావరి బనకచర్ల లింక్ ద్వారా పెన్నా బేసిన్ కు తరలించే కుట్రకు తెర లేపారంటున్నారు. కాగా ప్రాణహిత దాని దిగువన ఉన్న ఇంద్రావతి, శబరి నదుల ద్వారా గోదావరికి వరద నీళ్లు వచ్చి చేరుతాయి. జీబీ లింకు ద్వారా నీళ్లను తరలించేందుకు డీపీఆర్ సిద్దం చేసింది ఏపీ. ఇంకో వైపు పోలవరం ప్రాజెక్టు ద్వారా రోజుకు ఒక టీఎంసీ మేరకు జలాలు తరలించాల్సి ఉండగా కుడి, ఎడమ కాల్వలకు 4 టీఎంసీల నీళ్లు మళ్లించే పనిలో నిమగ్నమై ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్దంగా నిర్మాణ సామర్థ్యాలను విస్తరించడం చర్చకు దారి తీసేలా చేసింది. ఏపీ నిబంధనలకు నీళ్లు వదిలిందంటూ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ మేరకు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. అంతే కాదు పోలవరం డ్యామ్ డెడ్ స్టోరేజీ నుంచి కూడా 18 టీఎంసీల నీళ్లను తరలించేంఉదకు వీలుగా ఎత్తిపోతల పథకాన్ని నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. సీడబ్ల్యూసీకి, కేంద్రానికి, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు , పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖలు రాసింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ ఎన్జీటీ రూ. 248 కోట్ల జరిమానా విధించింది.
బచావత్ ట్రిబ్యునల్ ముందుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీటి వాటాను గోదావరిలో 1486 టీఎంసీలు కేటాయించింది. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు, ఏపీ వాటా కింద 518 టీఎంసీలంటూ తేల్చింది. ఇప్పటికే ఏపీ 776 టీఎంసీల నీళ్లను వాడుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో ఏపీ సీఎం దూకుడు పెంచారు. 200 టీఎంసీలను తరలించేందుకు జీబీ లింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇంకో వైపు పోతిరెడ్డిపాడు ద్వారా ఆయా రిజర్వాయర్లకు కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తుండడంపై కూడా నీటి పారుదల కమిషన్ అభ్యంతరం తెలిపింది. బనకచర్ల ప్రాజెక్టు వివాదం సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం వద్దకు చేరింది. ఇక నీటి వాటాల విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా వాటిని పట్టించుకోక పోవడం పట్ల తెలంగాణ ఆందోళనకు గురవుతోంది. ఈ జలాశయం వివాదం మరోసారి ప్రాంతాల మధ్య మరింత అంతరాలను పెంచేలా చేస్తోంది. ఇకనైనా ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలి. నీళ్ల వాటాలను సీడబ్ల్యూసీ , బచావత్ ట్రిబ్యునల్ , గాదావరి వాటర్ బేసిస్ మేనేజ్ మెంట్ ఆధారంగా వాడుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది.