
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ సముద్రం. స్వేచ్ఛ ఎక్కువ. ఎవరైనా సరే దేని గురించైనా మాట్లాడవచ్చు. కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నిన్నటి దాకా సీఎం రేవంత్ రెడ్డి పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఆ పేరు స్థానంలో కొత్త పేరు వినిపిస్తోంది. ఆ పేరు ఇప్పుడు కలకలం రేపుతోంది. పార్టీలోనే కాదు ఇతర పార్టీల నేతలను సైతం విస్తు పోయేలా చేస్తోంది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా..మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిబద్దత, నిజాయితీకి కేరాఫ్ గా నిలిచిన మీనాక్షి నటరాజన్. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతోంది.
తను ఏఐసీసీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ టీంలో కీలకమైన సభ్యురాలు. నిన్నటి దాకా ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరించిన నేతలను ఒకే తాటిపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రౌండ్ లో పార్టీ పట్ల ఎందుకంత వ్యతిరేకత వస్తోందన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో సంచలన కామెంట్స్ చేశారు. పార్టీలో 10 ఏళ్ల నుంచి పని చేసిన వారికే పదవులలో ప్రయారిటీ ఉంటుందని ప్రకటించారు. మొత్తంగా తెలంగాణ ఆపరేషన్ స్టార్ట్ చేయడంపై ఫోకస్ పెట్టింది. పార్టీనే ఫైనల్ .. వ్యక్తులు ముఖ్యం కాదని స్పష్టం హెచ్చరికలు జారీ చేసింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తూ వస్తున్న నేతలకు ఝలక్ ఇచ్చింది. వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యమని, వస్తుంటారు వెళుతుంటారు..వారి వళ్ల ఒనగూరేది ఏమీ ఉండదని చెప్పకనే చెప్పింది.
ఓ వైపు పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమ గీతం ప్రజా పాలన పేరుతో పవర్ లోకి తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నప్పటికీ రాను రాను ఆయన ఒంటెద్దు పోకడ, ఒకే సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇస్తుండడం, తనకంటూ స్వంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడం పట్ల ఒకింత హైకమాండ్ దృష్టి సారించింది. మంచి దూకుడు మీద ఉన్న తనను కట్టడి చేసేందుకు రంగంలోకి దించింది తమ దూతగా నటరాజన్ ను. ఆమె ఎక్కడా ప్రచారానికి ప్రయారిటీ ఇవ్వక పోయినా తను సెంటర్ పాయింట్ గా ఉన్నట్టుండి మారి పోయారు. పార్టీ స్టాండ్ ను కూడా మార్చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఒకటి పాత కాంగ్రెస్ సీనియర్లతో కూడిన వర్గం కాగా మరోటి వివిధ పార్టీల నుంచి పార్టీలో చేరిన వర్గంగా చీలి పోయారు.
ఈ మొత్తం వ్యవహారాలను గమనిస్తూ వచ్చిన మీనాక్షి నటరాజన్ మెల మెల్లగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి పవర్స్ ను తీసి వేసే పనిలో పడింది. కుల గణన సర్వే, బీసీ రిజర్వేషన్ల అంశం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో హై కమాండ్ రేవంత్ రెడ్డితో అంటీ ముట్టనట్టు వ్యవహరించడం కూడా ఒకింత ఆలోచనలో పడేసింది పార్టీ శ్రేణులను. ఇదే సమయంలో మీనాక్షి నటరాజన్ కీలక ప్రకటన చేశారు. తాను పాదయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించడం విస్తు పోయేలా చేసింది. దీపా దాస్ మున్షీ ఉన్న సమయంలో రేవంత్ మాటకు పవర్ ఉండేది..మీనాక్షి వచ్చాక కేవలం పదవి మాత్రమే మిగిలింది. ఒక్క ఉచిత బస్సు పథకం తప్పా ఏ ఒక్కటి ప్రజలను మెప్పించ లేక పోయింది సర్కార్. ఈ మొత్తం ఎపిసోడ్ లో రేవంత్ ఒంటరి కాగా పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని గుర్తించింది నటరాజన్. దిద్దుబాటు చర్యలకు దిగారు. పదవుల పందేరంలో ఫోకస్ పెట్టిన ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఇక్కడ పార్టీకే ప్రయారిటీ ఉంటుంది తప్ప వ్యక్తులకు కాదంటూ సున్నితంగా వార్నింగ్ కూడా ఇచ్చేశారు.
ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పార్టీలో కలకలం రేపింది. స్వయంగా ట్యాపింగ్ చేయిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హైకమాండ్ ను ఆలోచనలో పడేసింది. చివరకు మంత్రులతో పాటు మీనాక్షి ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందా అన్న అనుమానం నెలకొంది. అయితే తన వెనుక గోతులు తవ్వకుండా ఉండేందుకే తాను ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నానని, ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగేదేనంటూ చావు కబురు చల్లగా చెప్పారు. మంత్రుల మధ్య సమన్వయం లేక పోవడం కూడా ఇప్పుడు ఇబ్బందిగా మారింది. మరో వైపు రాష్ట్రంలో ప్రజలు తీవ్ర సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారు. ఈ తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, స్థానిక సంస్థలలో పట్టు పెంచుకోవడం పైనే ఫోకస్ పెట్టారు మీనాక్షి నటరాజన్. ఇందులో భాగంగానే పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్న టాక్. మొత్తంగా తెలంగాణలో సర్కార్ వచ్చిందన్న సంతోషం ఏమో కానీ రోజుకో కొత్త తలనొప్పితో హైకమాండ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకే పాదయాత్ర పేరుతో ఎమ్మెల్యేలు, ఎంపీలను కార్యోణ్ముఖులను చేసేందుకు రెడీ అయ్యింది. మరి మీనాక్షి నటరాజన్ ఏ మేరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాల్సిందే.