స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడు ఎక్క‌డ..?

ఈ దేశంలో మ‌తం ఓ ఫ్యాష‌న్ గా మారింది. ప్ర‌స్తుతం మార్కెట్ మ‌యం అయి పోయింది. మ‌తం అనేది స్లో పాయిజ‌న్ లాంటింది. మ‌త్తు మందు కంటే ప్రమాద‌మ‌ని ఆనాడే చెప్పాడు కోట్లాది మందిని నేటికీ ప్ర‌భావితం చేస్తున్న కార్ల్ మార్క్స్. మ‌తం జీవ‌న విధానంగా మారితే త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించే వారు కూడా లేక పోలేదు. లెక్క‌లేన‌న్ని ఆశ్ర‌మాలు, పీఠాలు, దేవాల‌యాలు కొలువు తీరి ఉన్నాయి. వీటిని న‌మ్ముకుని ఉన్న వారు కొంద‌రుంటే వీటినే ఆధారంగా చేసుకుని ఆధిప‌త్యం చెలాయిస్తున్న వాళ్లు వేల‌ల్లో ఉన్నారు. వారంతా ప్ర‌ముఖులు, బాబాల అవ‌తారం ఎత్తారు. మాయ‌లు చేశారు. మెస్మ‌రైజ్ చేస్తూ జ‌నాన్ని బురిడీ కొట్టించారు. ఇదే క్ర‌మంలో కేవ‌లం మ‌తం అన్న‌ది మ‌నుషుల మ‌ధ్య బంధాల‌ను పెంపొందించాలి. అన్ని మ‌తాల సార‌మంతా ఒక్క‌టే. తోటి మానవుల ప‌ట్ల‌, సాటి జంతు జీవ‌రాశుల ప‌ట్ల క‌రుణ చూపాల‌ని బోధిస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు మ‌తం రాజ‌కీయంతో అంటకాగుతోంది. నేత‌లు, స్వాములు క‌లిసి పోయారు. వీరిలో నేర‌స్థులు, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న వారు, ప్ర‌భుత్వాల‌ను శాసిస్తున్న వారు లేక పోలేదు. ఈ త‌రుణంలో శిక్ష‌ల నుంచి త‌ప్పించుకున్న వారి గురించి చెబితే ఏడాది కాలం ప‌డుతుంది. అంత‌లా దారుణాలు చోటు చేసుకున్నాయి.

త‌రాలు మారినా, ఏళ్లు గ‌డిచినా, టెక్నాల‌జీ ప‌రంగా కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకున్నా మ‌తం ఏదో ఒక రూపంలో స‌మాజాన్ని, ప్ర‌పంచాన్ని శాసించేలా చేస్తోంది. మ‌రో చోట అది ఉగ్ర‌వాదంతో కూడా జ‌త క‌ట్టింది. ప్ర‌స్తుతం 2014 త‌ర్వాత దేశంలో పెను మార్పులు జ‌రిగాయి. ఆర్ఎస్ఎస్, విహెచ్పీ , భ‌జ‌రంగ్ ద‌ళ్, ఏబీవీపీ హిందూ సంస్థ‌లు బీజేపీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావ‌డానికి ఇతోధికంగా దోహ‌ద ప‌డ్డాయి. రాం మందిరం పేరుతో చేప‌ట్టిన ర‌థ యాత్ర ఆ పార్టీకి బూస్ట్ గా ప‌ని చేసింది. దేశంలోని అన్ని వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ఇప్పుడు మోదీ, అమిత్ షా , మోహ‌న్ భ‌గ‌వ‌త్ క‌నుస‌న్న‌ల‌లో న‌డుస్తున్నాయి. వీరికి ఇప్పుడు అందివ‌చ్చిన అవ‌కాశంగా మారారు ప్ర‌ముఖ న‌టుడు, ప‌వ‌ర్ స్టార్ గా పేరు పొందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఆయ‌న సినిమాల ప‌రంగా ఎన్నో పాత్ర‌లు పోషించారు. ఇందులో ఏదీ శాశ్వ‌త‌మైన పాత్ర అంటూ ఉండ‌దు. అందుకేనేమో ఆయ‌న రాజ‌కీయాల‌ను కూడా అలాగే చూశాడు. ఆ దిశ‌గానే రోల్ ప్లే చేయ‌డం మొద‌లు పెట్టాడు. అంద‌రిని తోసి రాజ‌ని తానే హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడి అవ‌తారం ఎత్తారు.

అంత‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌పంచాన్ని ఉర్రూత లూగించిన చేగువేరా నా ఆద‌ర్శం అన్నాడు. కాన్షీ రాం, జ్యోతి బా పూలే, డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ తో పాటు తెలుగు వారిని సాహిత్య ప‌రంగా ప్ర‌భావితం చేసిన శ్రీ‌శ్రీ‌, జాషువా, గుంటూరు శేషేంద్ర శ‌ర్మ‌ల‌ను కోట్ చేస్తూ వ‌చ్చాడు. తెలంగాణ‌లో ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ తో సన్నిహితంగా మెలిగాడు. ఆ త‌ర్వాత తిరుమ‌ల‌లో అపవిత్రం జ‌రుగుతోందంటూ గొంతు పెంచాడు. జ‌గ‌న్ పాల‌న‌లో హ్యూమ‌న్ ట్రాఫికింగ్ జ‌రుగుతోంద‌ని, ఎంతో మంది బాలిక‌లు మిస్ అయ్యారంటూ ఆరోప‌ణ‌లు చేశాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇంకో వైపు పాలిటిక్స్ లో బిజీగా మారాడు. కేంద్రం స‌పోర్ట్ తో రెచ్చి పోయాడు. స‌నాత‌న ధ‌ర్మం కోసం తాను ప్రాణ త్యాగానికి సిద్దంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించాడు తిరుమ‌ల సాక్షిగా. నిత్యం సంచ‌ల‌నంగా మారేలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తెలిసినంత‌గా ఏ పొలిటిక‌ల్ లీడ‌ర్ కు తెలియ‌దంటే న‌మ్మలేం. ప‌వ‌ర్ లోకి వ‌చ్చాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు. త‌మిళ‌నాడుకు వెళ్లాడు. అక్క‌డ మ‌రోసారి స‌నాత‌న ధ‌ర్మం ప్ర‌మాదంలో ఉంద‌న్నాడు. హిందూ బంధువుగా త‌న‌ను తాను ప్రొజెక్టు చేసుకుంటూ ముందుకు వెళ్లాడు. ఇదే స‌మ‌యంలో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు లో న‌టించాడు.

బీజేపీ ప్లాన్ ను ప‌క్కాగా అమ‌లు చేస్తూ త‌న ప‌ద‌విని కాపాడుకుంటూ వ‌స్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. నిత్యం స‌నాత‌న ధ‌ర్మం అని నోరు చించుకుని మాట్లాడే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. యావ‌త్ భార‌త దేశాన్ని విస్తు పోయేలా దారుణాలు, ఘోరాల‌కు కేంద్రంగా మారిన ధ‌ర్మ‌శాల ఘ‌ట‌న విస్తు పోయేలా చేసింది. అక్క‌డి ధ‌ర్మాధికారి ఎవ‌రో కాదు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన రాజ్య స‌భ స‌భ్యుడు వీరేంద్ర హెగ్డే. త‌న క‌నుస‌న్న‌ల‌లో కొన‌సాగుతోంది ఇది. క‌ర్ణాట‌క స‌ర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. త‌న‌కు కేంద్ర స‌ర్కార్ పుర‌స్కారం అంద‌జేసింది. ఇంత జ‌రుగుతున్నా అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కానీ ఇటు బీజేపీ నేత‌లు, మోదీ, షా, బీఎల్ సంతోష్, ఆర్ఎస్ఎస్ చీఫ్ , స్వామీజీలు, బాబాలు, పీఠాదిప‌తులు, మ‌ఠాధిప‌తులు, త‌మంత‌కు తాముగా హిందూ ధ‌ర్మాన్ని కాపాడుతామంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న హిందూ ప్ర‌తినిధులు ఒక్క ప‌ల్లెత్తు మాట కూడా మాట్లాడ‌టం లేదు. స‌నాత‌న ధ‌ర్మం అంటే ఇదేనా అని ప్ర‌జాస్వామిక వాదుఉలు ప్ర‌శ్నిస్తున్నారు. నిన్న‌టి దాకా అరిచిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ ఉన్నాడంటూ ప్ర‌శ్నించాడు ఉద‌య‌నిధి స్టాలిన్. ఓ వైపు సినీ కార్మికులు వేత‌నాల కోసం ఆందోళ‌న చేప‌డితే ఇదే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఏపీలో మిస్సింగ్ అయిన వాళ్ల సంగ‌తి మ‌రిచి పోతే స‌రి మ‌రి ధ‌ర్మ‌శాల లో దారుణాల గురించి మాట్లాడ‌క పోవ‌డం దారుణం. దీనికి స‌మాధానం చెప్పాల్సింది త‌నే. మ‌రి దీనిని ఏమంటారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీ..

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *