
భారత దేశానికి స్వేచ్ఛ లభించి 79 సంవత్సరాలు అవుతోంది. దేశమంతటా జెండా పండుగను ఘనంగా నిర్వహించుకున్న తరుణంలో రాజ్యాంగ బద్దమైన వ్యవస్థ, ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఎందరో చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు పని చేశారు. కానీ ఒకే ఒక్కడు టీఎన్ శేషన్ మాత్రం సెన్సేషన్ గా మారారు. ఈసీకి ఎంత పవర్ ఉందో తెలియ చెప్పిన ఏకైక వ్యక్తి. ఇది పక్కన పెడితే ఎన్నికల నిర్వహణ రోజు రోజుకు అపహాస్యంగా మారుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. విస్తృతమైన , విశేషమైన అధికారాలను కలిగి ఉన్న ఏకైక వ్యవస్థ ఈసీ. కానీ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితాలో తప్పులు చోటు చేసుకోవడం, దొంగ ఓటర్ల నమోదు, పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం, ఎలాంటి పారదర్శకత లేక పోవడం, ఫక్తు ఒకే ఒక్క రాజకీయ పార్టీ ఒత్తిళ్లకు తల వంచడం, ఓటర్ల హక్కులను కాలరాయడం అనేది ఈసీ విశ్వసనీయతను దెబ్బ తీసేలా చేశాయి. ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అయ్యేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నం చేస్తుంది. చేయాలి కూడా.
దేశంలో ఎన్నికల నిర్వహణను నిర్వహించాల్సిన బాధ్యత ఈసీపై ఉంటుంది. గ్రామాల నుంచి పట్టణాల దాకా 143 కోట్ల మందిలో అత్యధిక శాతం ఓట్లను వినియోగించు కునేలా చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. సీఈసీల నియామకం పూర్తిగా పారదర్శకంగా జరగాలి. ఈసీ నిర్వాకంపై దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో ఎందుకు మోదీ ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించిందని నిలదీసింది. అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ప్రస్తుతం ఉన్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ విధుల్లో పదవీ విరమణ పొందిన వెంటనే తనకు పదోన్నతి ఎందుకు కల్పించారో చెప్పాల్సిన బాధ్యత ప్రధాని, రాష్ట్రపతిపై ఉంటుందని కామెంట్ చేసింది. ఎన్నికల సంఘం జవాబుదారీగా ఉండాలి దేశానికి, ప్రధానికో లేదా ఒక పార్టీకో కాదని కుండ బద్దలు కొట్టింది. ఈసీకి దివంగత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పని చేసిన టీఎన్ శేషన్ లాంటి అధికారి కావాల్సి ఉందని అభిప్రాయపడింది.
కోట్లాది మందికి జవాబుదారీగా ఉండే ఈసీ ఓటర్ల నమోదు , తొలగింపులో ఎందుకు పారదర్శకంగా వ్యవహరించడం లేదో చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈసీ అవసరమైతే ప్రధాన మంత్రిని, రాష్ట్రపతిని, ఉప రాష్ట్రపతిని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఎవరినైనా ప్రశ్నించి, నిలదీసేలా ఉండాలని, కానీ అయ్యా ఎస్ అనేలాగా ఉండ కూడదని కుండ బద్దలు కొట్టింది. ఇది పూర్తిగా గతి తప్పిన పాలనా వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. 2014 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను కోల్పోతూ వస్తోంది. ఇది దేశానికి, ప్రత్యేకించి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని పేర్కొంది సుప్రీంకోర్టు. గత కొన్నేళ్ల నుంచి రాజకీయాల జోక్యం మితిమీరి పోవడం దారుణమని అభిప్రాయపడింది. రాజ్యాంగ బద్దమైన సంస్థలన్నీ ఇప్పుడు నిర్వీర్య స్థితికి మారి పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది ధర్మాసనం.
ప్రస్తుతం భారత దేశం అసాధారణమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రధానంగా డెమోక్రసీ గురించి ఇది మరింత ఆందోళన కలిగించేలా చేస్తోంది. కొంత కాలంగా జాతీయ సంస్థలు సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ, ఆర్బీఐ, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ , న్యాయవ్యవస్థలు చేష్టలుడిగి పోయాయి. వీటికంటే ఎక్కువగా నిస్తేజంగా మారి పోయింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రధానంగా 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ సీ నిర్వాకం కారణంగా వెయ్యి మంది బలయ్యారు. కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉండేలా ఏడు దశల్లో పోలింగ్ షెడ్యూల్ చేయడం, మోడల్ ప్రవర్తనా నియమావళిని మార్చడం, పార్టికి మేలు చేకూర్చేలా వ్యవహరించడం, అభ్యర్థిత్వాలను రద్దు చేయడం, బదిలీలు చేపట్టడం, అస్పష్టమైన కారణాలతో పరిశీకులను నియమించడం, ఎసీసీ అమలులో ఉన్న సమయంలో మత పరమైన పుణ్య క్షేత్రాలను సందర్శించేందుకు నేతలకు పర్మిషన్ ఇవ్వడం లాంటి అనైతిక నిర్ణయాలు తీసుకుంది ఈసీ.
ఎన్నికల ప్రజాస్వామ్యానికి కీలకమైన పరీక్షలో ఈసీ విఫలం కావడమే కాకుండా రాజ్యాంగ బద్ధంగా ఆర్టికల్ 324లో నిర్దేశించిన విధంగా స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలని విశ్వసించే కోట్లాది మంది ఓటర్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఈసీలను మార్చే అవకాశం రాష్ట్రపతికి ఉంటుంది. మోదీ వచ్చాక ఈసీపై ప్రమేయం ఎక్కువైందన్న ఆరోపణలు ఉన్నాయి. 1989, 1990, 1991 సంవత్సరాల్లో సీఈసీలను మార్చారు. గతంలో ప్రధాన ఎన్నికల అధికారి నియాకమంలో తప్పనిసరిగా సీజేఐ సభ్యుడిగా ఉండేవారు. కానీ వ్యూహాత్మకంగా ఆ నిబంధనను మార్చేసింది. ఇప్పుడు ప్రధాని, కేంద్ర మంత్రితో పాటు విపక్ష నేత నిర్ణయిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకతతో ఉండాలి.143 కోట్ల ప్రజలకు జవాబుదారీగా ఉండాలే తప్పా మోదీకో లేక ఇతర నేతలతో అయ్యా ఎస్ అనేలా ఉండ కూడదు. ఇప్పటికైనా ఈసీ మారాలి. లేక పోతే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. దేశ భవిష్యత్తు గాలిలో దీపంలా మారుతుంది.