
”ఎవరైనా గొప్పగా బతికేందుకు ప్రయత్నం చేస్తారు. అందులో విశేషం ఏముంది..? కానీ కొందరు మాత్రం ఎదిగేందుకు, కొన్ని తరాల పాటు బతికేందుకు కావాల్సిన సదుపాయాలను పొందుతారు. సమకూర్చుకుంటారు. ప్రజాస్వామ్యంలో , ముఖ్యంగా రాజకీయాలలో నిజమైన, నీతి, నిబద్దత, నిజాయితీ, ఆదర్శ ప్రాయమైన, సమస్త ప్రజానీకానికి, మట్టికి స్పూర్తి దాయకంగా నిలిచే వ్యక్తులు భూతద్దం పెట్టి వెతికినా దొరకడం కష్టంగా మారింది. ఎందుకంటే నేరం, రాజకీయం, కరెన్సీ, మాఫియా, అధికార దాహం, మోసం కలగలిసి పోయిన చోట ఎక్కడని వెదకాలి. ఇప్పుడు పవర్ కోసమే ప్రజాస్వామ్యం అన్నట్టుగా మార్చేశారు పొలిటికల్ లీడర్లు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి. ప్రజల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఈ క్రమంలో చట్టాలు చేసే అధికారం కేవలం పాలకులకు మాత్రమే ఉంటుంది. వారి చేతుల్లోనే చట్టాలు రూపు దిద్దుకుంటాయి. ఇలాంటి శాసనాలు తయారు చేసే వ్యవస్థలో భాగస్వామ్యం కావడానికి చాలా అర్హతలు ఉండాలి. కానీ ఈ దేశంలో కేవలం చదువు ఒక్కటే ప్రామాణికం కాదు. కులం, ఆధిపత్యం, పదవీ వ్యామోహం మనుషుల్ని రాజకీయాల వైపు మళ్లేలా చేస్తున్నాయి. ఈ బలీయమైన, వ్యవస్థను కబళించిన చట్రంలో ఇరుక్కోకుండా ప్రజల కోసం పని చేసేవాళ్లు ఒకరో లేదా ఇద్దరో ఉంటారు. కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉండాల్సిన వాళ్లు..చివరకు విలువలకు తిలోదకాలు ఇస్తే ఎలా..? సవాలక్ష సమస్యలతో సతమతం అయ్యే అభాగ్యుల పరిస్థితి ఏం కావాలి..?”
అంటూ తెలంగాణ సమాజం వేలెత్తి చూపిస్తోంది ప్రొఫెసర్ కోదండ రాం అలియాస్ ముద్దసాని కోదండ రాం రెడ్డిని. బలిదానాలు, ఆత్మ త్యాగాలు, ఆత్మహత్యలు, ఎన్ కౌంటర్లకు కేరాఫ్ గా మారి చివరకు రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణలో ఆయన పేరు తెలియని వారంటూ ఉండరు చిన్నారుల నుంచి పెద్దల దాకా. ఈ మట్టికి ఎనలేని చరిత్ర ఉన్నది. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో దోపిడీకి గురైంది. అవమానాలను భరించింది. కడుపు శోకంతో రగిలి పోయింది. కళ్ల ముందే బిడ్డలను కోల్పోయింది. వివక్షకు గురైంది. రాష్ట్రం ఏర్పాటైనా ఇంకా ప్రయోగాలకు కేరాఫ్ గా మారింది ఈ నేల. ఎంత విచిత్రం కదూ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వాడు. పౌర హక్కుల కోసం ఆక్రోశించిన వాడు. సంబండ వర్గాలను ఏకం చేసిన వాడు. ఎన్నో ఉద్యమాలతో, ప్రజా సంఘాలతో, ప్రజలతో మమైకమైన వాడు, నీళ్లు, నిధులు, నియామకాల గురించి లెక్కలతో సహా వివరించి ఒప్పించిన ఆచార్య కోదండరాం సారు ఉన్నట్టుండి చిన్న పదవి ఎమ్మెల్సీ కోసం తనను తాను తగ్గించుకున్నాడు. తనను గొప్పగా భావించుకుంది ఈ సమాజం. నిలువెల్ల గాయాలతో ఉన్న తెలంగాణ సమాజం మోసాలను భరించింది. అయినా ఆకలితో వస్తే అన్నం పెట్టింది. ఇంతటి మహోన్నతమైన ప్రజా సమూహం ఉన్న చోట కోదండరాం తప్పటడుగు వేయడం ప్రజాస్వామిక వాదులను, ముఖ్యంగా తెలంగాణ వాదులను విస్మ య పరిచేలా చేసింది.
తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న కోదండరాం పేదలు, అన్నార్థులు, అభాగ్యులు, బడుగులు, బలహీన వర్గాలకు ఆలంబనగా, భరోసాగా ఉంటారని అనుకున్న సమయంలో ఉన్నట్టుండి కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషంతో తనను తాను తగ్గించుకుంటూ వచ్చారు. ఆపై పార్టీ పెట్టారు. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆపై కాంగ్రెస్ కు బహిరంగంగానే మద్దతు పలికారు. ఆ తర్వాత పవర్ లోకి వచ్చాక తన వారికి కొందరికి పదవులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి పొందారు. చివరకు రాజ్యాంగ విరుద్దంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం ముందు దోషిగా నిలబడ్డారు. ఇవాళ ధర్మాసనం ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి, ఆయన సర్కార్ కు చెంప పెట్టు లాంటిది. ఈ తీర్పు కోదండరాం రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చింది కాదు యావత్ తెలంగాణ సమాజానికి చేసిన గాయం ఇది. ఓ వైపు పిల్లలు పిట్టల్లా రాలి పోతున్నా, అడ్డగోలు హామీలు ఇస్తూ జనాన్ని మోసం చేస్తున్నా, 2 లక్షల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిలువెల్లా చీటింగ్ చేసినా, ప్రశ్నించిన గొంతుకలపై ఉక్కు పాదం మోపినా, నీళ్ల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నా కోదండం రాం రెడ్డి మౌనం వహించడం క్షమించరాని నేరం. చరిత్రలో నిలిచి పోవాలంటే పదవులే ముఖ్యం. గుర్తస్తే మంచిది. కోదండరాం సారుగా ఉంటారా లేక కోదండరాం రెడ్డిగా నిలిచి పోతారా తేల్చుకోవాల్సింది తనే.