
ఓ వైపు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వాకంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఓట్ల చోరీపై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. తొలగించిన ఓటర్లను బహిరంగం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో కేంద్ర సర్కార్ మౌనం వహించింది. కోల్పోయిన పరువును, నమ్మకాన్ని తిరిగి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా ప్లాన్ వేసింది. గత కొన్నేళ్లుగా జీఎస్టీ రూపంలో 143 కోట్ల మంది భారతీయుల రక్తాన్ని పన్నుల రూపేణా పీల్చి పిప్పి చేస్తూ బడా బాబులకు మేలు చేకూర్చేలా చేస్తూ వచ్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంది. ఈ తరుణంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. రాబోయే దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త చెబుతానని, ఆరోజంతా మీరు దీపాలు వెలిగించాల్సిందేనని పేర్కొన్నారు. ఇంతకూ ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే కోట్లాది మందిని జీఎస్టీ (వస్తు, సేవల వినియోగంపై పన్ను) నిద్ర లేకుండా చేస్తోంది. చివరకు మహిళలు, యువతులు, బాలికలు వాడే శానిటరీ న్యాప్కిన్స్ (ప్యాడ్స్ )పై కూడా జీఎస్టీ వేసిన చరిత్ర మోదీ ప్రభుత్వానిది.
ప్రతి ఏటా జీఎస్టీ రూపంలో కేంద్ర సర్కార్ కు వేలాది కోట్ల ఆదాయం సమకూరుతోంది. అవన్నీ మౌలిక సదుపాయల కల్పనకు ఖర్చు పెడుతున్నామని అంటోంది. కేవలం రోడ్లు, ఎయిర్ పోర్టులు, ఓడ రేవులు, లాజిస్టిక్స్, ఫార్మా, తదితర రంగాలపైనే ఖర్చు చేస్తోంది. కానీ దారిద్ర రేఖకు దిగువన ఉన్న కోట్లాది మంది అంటే దాదాపు 80 శాతానికి పైగా పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, గిరిజనుల బతుకు దెరువు కోసం ఎలాంటి కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. స్టాండప్ ఇండియా , మేకిన్ ఇండియా పేరుతో ప్రచారం చేస్తోందే తప్పా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ల కారణంగా ఎంత మందికి ఉపాధి కల్పించారనే దానిపై ఇప్పటి వరకు కేంద్రం వద్ద లెక్కలు లేవు. 2014లో మోదీ బీజేపీ సర్కార్ కొలువు తీరింది. ఆనాటి నుంచి నేటి దాకా కేవలం వ్యాపారుల ప్రయోజనాలను కాపాడే విధంగా పాలసీలు ఉన్నాయే తప్పా సామాన్యుల బాగు కోసం స్కీంలు కానీ, యాక్షన్ ప్లాన్స్ తీసుకు వచ్చిన దాఖలాలు లేవు.
నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ (ఎన్ఎస్డీసీ) స్కీం తీసుకు వచ్చినా ఇప్పటి వరకు ఎంత మందికి నైపుణ్యాభివృద్ది కల్పించారో చెప్పలేదు. వారి వద్ద డేటా కూడా లేదు . కరోనా సమయంలో ప్రధాని సహాయ నిధికి ఎన్ని వేల కోట్లు వచ్చాయో చెప్పాలంటూ ఆర్టీఐ కింద అడిగితే చివరకు ఆర్టీఐ ఎందుకు ఉండాలంటూ ప్రశ్నించిన పాలకులు వీళ్లు. ఇప్పుడు దేశం మొత్తం మోదీపై, ఆయన పరివారంపై, ప్రభుత్వంపై అనుమానపు చూపులు చూస్తోంది. ఓట్ల చోరీ అనేది ఒక మచ్చలాగా మారింది. ఈ సీరియస్ అంశం నుంచి గట్టెక్కేందుకే మోదీ ఇప్పుడు తెలివిగా జనం ముందుకు జీఎస్టీని తీసుకు వచ్చాడేనది వాస్తవం అంటున్నారు ఆర్థికరంగ నిపుణులు. ఇక జీఎస్టీ విషయానికి వస్తే వస్తువులు, సేవలపై విధించే ఏకకృత పన్ను వ్యవస్థనే ఈ జీఎస్టీ. ఇది జూలై 1, 2017 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. దీని ఉద్దేశం దేశ మంతా ఒకే పన్ను వ్యవస్థను ఉండేలా చేయడం. గతంలో ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్ , వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్ లాంటివి ఉండేవి. వాటన్నింటిని కలిపి జీఎస్టీ గొడుగు కిందకు తీసుకు వచ్చారు. సెంట్రల్ జీఎస్టీ కేంద్రానికి వెళుతుంది.
స్టేట్ జీఎస్సీ రాష్ట్రానికి వెళుతుంది. ఇంటర్ స్టేట్ జీఎస్టీ రాష్ట్రాల మధ్య లావాదేవీలపై కేంద్రానికి చేరుతుంది. ఆహార వస్తువులు, బేసిక్ ఐటమ్స్ పై 1 శాతం జీఎస్టీ ఉండగా సాధారణ ఆహార పదార్తాలు, గృహ అవసరాలకు సంబంధించి 5 శాతం, ప్రాసెస్ చేసిన ఆహారం, కొన్ని గృహ ఉత్పత్తులపై 12 శాతం, సేవలుఉ, తయారీ వస్తువులపై 18 శాతం, లగ్జరీ వస్తువులు, సిగరెట్లు, కార్లపై 28 శాతం జీఎస్టీ కింద విధిస్తూ వచ్చారు. గతంలో ఏడాదికి ఒకసారి ట్యాక్స్ ఫైల్ చేసే వారు. జీఎస్టీ కింద వ్యాపారం చేసే వారు నెల వారీగా లేదా మూడు నెలలకు ఒకసారి జీఎస్టీఆర్ -1, జీఎస్టీఆర్ -3బి తప్పనిసరిగా రిటర్నులు ఫైల్ చేయాలి. కేంద్రం, రాష్ట్రాల మంత్రులతో జీఎస్టీ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. అది ఉన్నా లేనట్టే. డిజిటల్ ట్యాక్స్ వ్యవస్థను తీసుకు వచ్చామని, దీని వల్ల దేశం మరింత పురోగతి సాధిస్తుందని ప్రకటించారు ఆర్తిక మంత్రి నిర్మలా సీతారామన్, పీఎం మోదీ. కానీ అప్పుల కుప్పగా మార్చేశారే తప్పా అభివృద్ది అన్నది మచ్చుకైనా లేకుండా పోయింది. పన్ను చెల్లింపు సులభతరం అయినా ఎక్కువగా సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు నిత్యం వాడే సరుకులు, వస్తువులపైనే పన్ను భారం ఉండడం ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేలా చేసింది.
జీఎస్టీల వసూళ్ల పరంగా చూస్తే దిమ్మ తిరిగి పోతుంది. 2017 నుంచి 2018 (జూలై టు మార్చ్ ) రూ. 7.19 లక్షల కోట్లు వసూలైంది. 2018 నుంచి 2019 సంవత్సరానికి అది కాస్తా పెరిగింది. రూ. 11.77 లక్షల కోట్లకు చేరుకుంది. 2019 నుంచి 2020 సంవత్సరానికి గాను రూ. 12.22 లక్షల కోట్లు , 2020-21 సంవత్సరానికి రూ. 11.36 లక్షల కోట్లు, 2021-2022 సంవత్సరానికి గాను జీఎస్టీ వసూళ్లు రూ. 14.83 లక్షల కోట్లు , 2022-23 ఏడాదికి రూ. 18.10 లక్షల కోట్లు, 2023-24 సంవత్సరానికి గాను రూ. 19.80 లక్షల కోట్లు , 2024-25 సంవత్సరానికి రూ. 22.08 లక్షల కోట్లు జీఎస్టీ పరంగా వసూళ్లయ్యాయి. కాగా 2020-21లో కోవిడ్ కారణంగా జీఎఎస్టీ వసూళ్లు తగ్గాయి. తాజాగా ప్రధాని మోదీ ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణల వల్ల ఏయే రంగాలకు మేలు చేకూరుతుందనేది చెప్పలేదు. రెండు స్లాబులను మాత్రమే ప్రతిపాదిస్తారా లేక ఒకే విధానం అమలులోకి తీసుకు వస్తారా అన్నది ఇంకా తేల్చలేదు. వీటిలో ఒకటి 5 శాతం స్లాబ్ రెండోది 18 శాతం స్లాబ్ విధానం ఉండాలని అనుకుంటోంది. మోదీ లెక్క ప్రకారం 28 శాతం లోని 90 శాతం వస్తువులను 18 శాతం పరిధిలోకి 12 శాతం స్లాబ్ ఓని 99 శాతం వస్తువులను 5 శాతం పరిధిలోకి తీసుకు రానున్నట్లు సమాచారం. జీఎస్టీ లో తీసుకు రాబోయే సంస్కరణలు పేదలకు మేలు చేకూరుస్తాయని, తద్వారా దేశ ఆర్తిక పరిస్థితి మెరుగవుతుందని చెప్పడం ఏ మేరకు ఆచరణలో వర్కవుట్ అవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.