
ప్రతి నెల నెలా వచ్చే రుతుస్రావం (నెలసరి) ను ఇంకా ఈ దేశంలో నేరంగా భావిస్తున్న వాళ్లు ఉన్నారు. దాని పేరుతో మహిళలు, యువతులు, బాలికలను దూరంగా నెట్టి వేసే ప్రయత్నం చేస్తున్న దరిద్రులు ఉన్నారు. నెలసరి పేరుతో ఇంట్లోనే దూరంగా ఉంచే వివక్ష కూడా చాలా చోట్ల కొనసాగుతోంది. అసలు నెలసరి అనేది నిత్యం స్త్రీకి సంబంధించిన శారీరక ధర్మం. ప్రతి నెలా నెలా మార్పులు చోటు చేసుకుంటాయి. దీనిని చెడు రక్తం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరి (బాలికలు, యువతులు, స్త్రీలు ) మానసిక, శారీరక పరిస్థితి దారుణంగా ఉంటుంది. అంతకు మించి మానసిక పరమైన ఆందోళనలు ఉంటాయి. కేవలం ఒక్క మహిళలకే ఈ పరిస్థితి దాపురించింది. ఇదే ఈ ప్రపంచానికి కొత్త ప్రాణులను పరిచయం చేసేందుకు దోహద పడుతుంది. దీనికి మనవాళ్లు పెట్టిన అందమైన పేరు నెలసరి. ఇప్పటికీ అదేదో నేరమైనట్టు, తప్పు చేసినట్లు భావిస్తున్నారు. నేటికీ చాలా ఆలయాల్లోకి రుతుస్రావం అవుతుందన్న సాకుతో దేవాలయాల్లోకి రానివ్వకుండా చేస్తున్నారు. ఆ మధ్యన లక్షలాది మంది భక్తులను కలిగిన కేరళ లోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిని సవాల్ చేస్తూ తామెందుకు అర్హులం కాము అంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సంచలన తీర్పు చెప్పింది ధర్మాసనం. వాళ్లు లేకుండా ఈ ప్రపంచం లేదు. వాళ్లు ప్రవేశించని రంగం, దారులు లేవు. మరి నెలసరి పేరుతో రాకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించింది. అయినా మతం రాజ్యం చెలాయిస్తున్న తరుణంలో ప్రతి చోటా అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇది పక్కన పెడితే ..దేశంలో సగానికి పైగా జనాభా ఉన్న మహిళలకు ఇంకా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంలో చర్చ జరుగుతోంది. ఆకాశంలో సగమని అంటూనే అధః పాతాళానికి తొక్కేస్తోంది సమాజం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్బంగా మహిళలకు సంబంధించి నెల నెలా వచ్చే నెలసరిపై విస్తృతంగగా చర్చ జరిగింది. దీనిపై ప్రత్యేకంగా అభినందించాల్సింది మహిళా ఎంపీలను. పార్లమెంట్ సాక్షిగా విస్తృతంగా చర్చకు వచ్చేలా లేవదీశారు. పలు ప్రశ్నలు సంధించారు. కోట్లాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ , అసంఘటిత రంగాలలో మహిళలు, యువతులు, బాలికలు పని చేస్తున్నారు. కానీ ప్రతి నెల నెలా వచ్చే రుతుస్రావం (నెలసరి లేదా మెన్సెస్ ) కు సంబంధించి ఎందుకు సెలవులు ఇవ్వడం లేదనంటూ ప్రశ్నించారు. దీనిని ఓ హక్కుగా, చట్టంగా తీసుకు రావాలని ఎప్పటి నుంచో కోరుతూ వస్తున్నారు. కానీ కొలువుతీరిన పాలకులకు అవేవీ పట్టడం లేదు.
ఆ సమయంలో ఎంతో ఇబ్బందులకు గురవుతారని, వారి మానసిక, శారీరక స్థితి దారుణంగా ఉంటుందని, వారు పని చేసే మూడ్ లో కూడా ఉండరని మహిళా కౌన్సెలర్లు, వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వారికి ప్రశాంతత అవసరమని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు మహిళా ఎంపీలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ చట్టంగా రూపు దిద్దుకునేంత దాకా ఇది అమలు కాదన్నది సత్యం. ఇప్పటికే వేలాది కంపెనీలు, సంస్థలు కొలువు తీరాయి దేశంలో. అన్ని రంగాలలో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అటెండర్ స్థాయి నుంచి చైర్మన్ల దాకా కూలీల నుంచి కార్పొరేట్ పదవుల దాకా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మరికొన్ని చోట్ల ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. వేలాది మంది మహిళా హక్కుల కార్యకర్తలు నెలసరి సమయంలో సెలవులు తప్పక ఇవ్వాలని కోరుతున్నాయి. కానీ వారి నినాదాలు ఆక్రందనల వరకే పరిమితమై పోయాయి.
కానీ ఆచరణకు నోచుకోవడం లేదు. దేశ రాష్ట్రపతి కూడా మహిళ ఉన్నారు. ఎన్నో చోట్ల కీలక పదవులు చేపట్టారు. కానీ వారికి స్వేచ్ఛ లేకుండా పోయింది. కనీసం నెలసరి విషయంలోనైనా ప్రభుత్వాలు, పాలకులు మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్లు ఈ స్థాయిలో రావడానికి కారణం మహిళలేనని మరిచి పోతే ఎలా. ఈ తరుణంలో ఆయా కంపెనీలు, సంస్థల యజమానులు, ప్రభుత్వ శాఖల్లోని బాధ్యులు మహిళలకు రుతుక్రమ సెలవులు మంజూరు చేయడాన్ని తప్పనిసరి చేసే చట్టాన్ని ప్రవేశ పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇది యుద్ద ప్రాతిపదికన చేయాలి. ఇదిలా ఉండగా కొన్ని సంస్థలు ఇప్పటికే సెలవులు ప్రకటించాయి. అందులో ఫుడ్ డెలివరీ సర్వీస్ లో పేరొందిన జొమాటో పీరియడ్ లీవ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. అంతర్జాతీయంగా ప్రశంసలు కూడా అందుకుంది. 2017లో కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ నినాంగ్ ఎరింగ్ రుతుస్రావం ప్రయోజనాల బిల్లును ప్రవేశ పెట్టారు. కానీ అది ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు. చట్టంగా మార్పు చెందలేదు. అయితే నెలసరి ఎందుకంటూ ప్రశ్నించింది మాజీ బీజేపీ మహిళా ఎంపీ. ఏది ఏమైనా ఇప్పటికైనా బీజేపీ సర్కార్ మహిళలకు నెలసరి సెలవు మంజూరు చేసేలా చట్టాన్ని తీసుకు రావాలని కోరుకుందాం. వాళ్లకు మనసు ఉందని , శరీరం ఉందని గుర్తిద్దాం.