
కూటమి సర్కార్ ను ప్రశ్నించిన జగన్ రెడ్డి
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడుపై ఉందన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. బుధవారం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చాడో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.
సభలో ఏమీ జరగక పోయినా ఒక డ్రామా క్రియేట్ చేశాడని, ఆ తర్వాత చాలా తెలివిగా ఏడ్పు రాక పోయినా ఏదో జరిగి పోయినట్లు, కొంపలు కూలి పోయినట్లు తెగ నటించాడని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన నటనను చూసి ప్రతి ఒక్కరు విస్తు పోయారన్నారు. సినిమాలలో నటించే నటులు సైతం ఆశ్చర్య పోయేలా ఏడ్చాడని, దీంతో అందరూ తనకు ఏదో అయి పోతోందని విస్మయానికి లోనయ్యారని చెప్పారు జగన్ రెడ్డి. తాను గనక శాసన సభలో ఉంటే అసెంబ్లీకి రానంటూ వెళ్లి పోయాడని, ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడని ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు మాజీ సీఎం. అసెంబ్లీ రికార్డులు మొత్తం తిరగేశానని, కానీ ఎక్కడా మావాళ్లుతప్పు మాట్లాడలేదని, ఆ విషయం తేలి పోయిందన్నారు.