
కూటమి ప్రభుత్వ పాలన బేకార్
విజయవాడ : ఏం సాధించారని సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటూ సభ నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. హామీలు అమలు చేశామని అప్పుడే సక్సెస్ సభలు జరపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుధవారం షర్మిల మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా అని నిలదీశారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఉంటే ఒక్కరికైనా 3 వేల నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి.
ముందు మీరు ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థాపించని పరిశ్రమలతో అగ్రిమెంట్లు చేసుకున్నంత మాత్రానా ఉద్యోగాలు ఇచ్చినట్లా అని ఫైర్ అయ్యారు. ఒక్కరికి భృతి ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం రాకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 15 వందలు ఆర్థిక సహాయం అనేది సూపర్ సిక్స్ హామీ అన్నారని ఇప్పటి వరకు దాని ఊసే లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో ఒక్క మహిళకైనా 15 వందలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇదేనా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ? అన్నదాత సుఖీభవ కింద సొంతగా 20 వేలు ఇస్తామని మాట మార్చారని ఆరోపించారు.