ఈవోగా ప‌ని చేయ‌డం పూర్వ జ‌న్మ సుకృతం

బ‌దిలీపై వెళుతున్న జె. శ్యామ‌ల రావు కామెంట్స్

తిరుప‌తి : ఎంతో పుణ్యం ఉంటేనే కానీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ఈవోగా ప‌ని చేయ‌లేమ‌న్నారు బ‌దిలీపై వెళుతున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామ‌ల రావు. అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చాన‌ని చెప్పారు. చాలా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింద‌న్నారు. త‌న‌కు ఛాన్స్ ఇచ్చిన సీఎం చంద్ర‌బాబుకు, స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సంద‌ర్బంగా పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని చెప్పారు. బ‌దిలీపై వెళుతున్న ఈవోకు స‌న్మాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో.

టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఈవోగా ఉన్న శ్యామ‌ల రావు ఏడాది కాలంలో చాలా సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. చాలా జఠిల సమస్యలను కూడా సమిష్టిగా హ్యాండిల్ చేసేందుకు కృషి మరువలేనిదన్నారు. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాలు తయారీ, పంపిణీ, అన్న ప్రసాదాల వితరణ, వసతిపై చాలా సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ విధానం ద్వారా అన్న ప్రసాదాల పంపిణీలో భక్తుల నుండి 96 శాతం సంతృప్తి వ్యక్తం చేసేందుకు శ్యామలరావు కృషి చాలా ఉందన్నారు. ఐవీఆర్ఎస్ విధానం, వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానం, శ్రీవారి సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి, సదరు అభిప్రాయాలను అంతటిని క్రోడీకరించి లోపాలను సవరించుకుంటూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నార‌న్నారు.

జేఈవో వి. వీరబ్రహ్మం మాట్లాడుతూ టిటిడిలోని ఐటీ విభాగంలో సమూల మార్పులను శ్యామల రావు తీసుకువచ్చారన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, స్థానిక ఆలయాల బ్రహ్మోత్సవాలు, ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కల్యాణం, అమరావతిలో శ్రీనివాస కల్యాణం తదితర కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షించి విజయవంతం చేశారన్నారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించి మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు.

టిటిడి సివిఎస్వీ మురళీకృష్ణ మాట్లాడుతూ టిటిడిలో భద్రతాపరంగా ప్రత్యేక దృష్టి పెట్టి భక్తులకు రక్షణ కల్పించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారన్నారు. టిటిడిలో దళారి వ్యవస్థను కట్టడి చేసేందుకు విజిలెన్స్ విభాగాన్ని నిత్యం పర్యవేక్షించారన్నారు. టిటిడి ఎఫ్ ఏ సీఏవో ఓ. బాలాజీ మాట్లాడుతూ, టిటిడిలో కియోస్క్ యంత్రాలను తీసుకువచ్చి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ విధానం టిటిడిలో తొలిసారి అమలు చేశారన్నారు.

సన్మాన సభ ప్రారంభానికి ముందు బదిలీపై వెళ్తున్న ఈవో జె. శ్యామలరావుకు శ్రీవారి ఆలయం, తిరుచానూరు ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయాల అర్చకులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *