
7 వికెట్ల తేడాతో దాయాదిపై గ్రాండ్ విక్టరీ
దుబాయ్ : చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్ జట్టుకు మరోసారి తన సత్తా ఏమిటో చూపించింది సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు. దుబాయ్ వేదికగా జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ -2025 మెగా టోర్నీలో తన విజయయాత్రను కొనసాగిస్తోంది. లీగ్ లో భాగంగా జరిగిన 2వ కీలక మ్యాచ్ లో దుమ్ము రేపింది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటింది. సమిష్టి కృషితో ఏకంగా 7 వికెట్ల భారీ తేడాతో పాకిస్తాన్ పై అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మరోసారి చక్రం తిప్పారు భారత స్పిన్నర్లు. కళ్లు చెదిరే బంతులతో చుక్కలు చూపించారు దాయాదులకు.
పాకిస్తాన్ జట్టు స్కిప్పర్ ఆఘా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తన అంచనా తప్పని తేలి పోయింది. తొలి ఓవర్ లోనే ఓపెనర్లను పెవిలియన్ కు పంపించారు హార్దిక్ పాండ్యా, స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా. ఆ తర్వాత స్పీన్నర్లు కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్ షాక్ ఇచ్చారు. వీరి బంతులను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడ్డారు. కుల్దీప్ 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే అక్షర్ పటేల్ 18 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. ఫర్హాన్ ఒక్కడే 44 బాల్స్ ఎదుర్కొని 40 రన్స్ చేశాడు. మిగతా బౌలర్లు తల వంచారు .
అనంతరం 128 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నిర్ణీత 15.5 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ సూర్య భాయ్ 31 బంతుల్లో 47 రన్స్ చేసి నాటౌట్ గా నిలవగా అభిషేక్ శర్మ 13 బంతుల్లో 31 పరుగులు చేస్తే , తిలక్ వర్మ 31 బాల్స్ ఎదుర్కొని 31 రన్స్ చేశారు.