
దుమ్ము రేపిన కుల్దీప్ యాదవ్
దుబాయ్ : ఆసియా కప్ లో భాగంగా జరిగిన కీలక పోరులో పాకిస్తాన్ ను భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది రెండో విజయం. ఇక కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కు చిరస్మరణీయమైన విజయం అని చెప్పక తప్పదు. తను టి20 జట్టుకు నాయకత్వం వహించిన తర్వాత అత్యధిక విక్టరీలు నమోదు చేస్తూ వచ్చాడు. ప్రత్యేకించి మైదానంలో తన ఆట తీరుతోనే కాదు నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు . ఆతిథ్య జట్టు యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లో ఆటగాడు ఔట్ కాలేదంటూ ఆడాలని కోరాడు. క్రీడా స్పూర్తిని చాటు కున్నాడు. ఇక మ్యాచ్ లో భాగంగా భారత బౌలర్లను వినియోగించుకున్న తీరు, తాను ఆడిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించేలా, అభిమానించేలా చేసింది.
ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్ కే కట్టడి చేయడంలో భారత బౌలర్లు కీలక పాత్రలు పోషించారు. తొలి సెషన్ లో దాయాది జట్టుకు చుక్కలు చూపించారు హార్దిక్ పాండ్యా, బుమ్రా. ఆ తర్వాత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మిస్సైల్ లాంటి బంతులకు విల విల లాడి పోయారు పాకిస్తాన్ బ్యాటర్లు. దీంతో 9 వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ 127 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత జట్టు త్వరగానే గిల్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత గెలిపించే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు సూర్య భాయ్. 31 బంతులు మాత్రమే ఎదుర్కొని 47 రన్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు.