
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యా విధానంలో కీలకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. బుధవారం సచివాలయంలో తెలంగాణ విద్యా విధానం రూపకల్పనపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం ఉండాలన్నారు. భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో నూతన విద్యా విధానం ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్-2047 విడుదల చేస్తామని ప్రకటించారు సీఎం.
విద్యా రంగం సమూల ప్రక్షాళనే తమ ధ్యేయం అని స్పష్టం చేశారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మౌలిక వసతుల మెరుగుదలపై ఫోకస్ పెడతామని చెప్పారు. సిలబస్, వనరుల సమీకరణ, అమలుపై స్పష్టత అవసరం అన్నారు. పేదరిక నిర్మూలనకు విద్యే ఏకైక ఆయుధం అని అన్నారు రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, యూనివర్సిటీ వీసీల నియామకాలు పూర్తయ్యాయని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. విద్య అనేది ఖర్చు కాదని అది రాబోయే తరాలకు తరగని సంపదగా భావించాలని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి.