
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కామెంట్
హైదరాబాద్ : ఆల్మట్టి ఎత్తు గనుక పెంచితే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు సమావేశం అయ్యారని తెలిపారు. కృష్ణా ట్రిబ్యూనల్ 2013 లో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి తీర్పు ఇచ్చిందని చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తీరుపై ఆందోళనలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో అప్పటి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేస్తే ట్రిబ్యునల్ తీర్పుపై స్టే వచ్చిందని పేర్కొన్నారు మాజీ ఎంపీ. 2014లో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టు స్టే కొనసాగించేలా చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
నిన్న కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు విస్తరణ కోసం లక్షా 33 వేల ఎకరాల భూ సేకరణ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిందని వెల్లడించారు మాజీ ఎంపీ.ఈ భూ సేకరణ కోసం రెండేళ్లలో 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని కర్ణాటక లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని , కర్ణాటక ఆల్మట్టిపై నిర్ణయం తీసుకుని రెండు రోజులు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. సుప్రీం కోర్టు స్టే పెండింగ్‌లో ఉండగానే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచడానికి తీసుకున్న నిర్ణయంపై తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు వినోద్ కుమార్. కృష్ణా నదిలో ఒక్క నీటి చుక్కను వదలుకోమని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, మరి కర్ణాటక అక్రమంగా ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఇదే సమయంలో మరాఠా సర్కార్ సీరియస్ గా స్పందించిందని, కర్ణాటక సర్కార్ కు వార్నింగ్ కూడా ఇచ్చిందన్నారు.