
బీఆర్ఎస్ ను కాపాడుతున్న కిషన్ రెడ్డి
ఢిల్లీ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై స్పందించారు. ఆమె గనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే అడ్డుకుని తీరుతానని ప్రకటించారు. ఢిల్లీ టూర్ లో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు. రెండు గంటలపాటు మీడియాతో సీఎం చిట్ చాట్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు సీబీఐ దర్యాప్తుని కేటీఆర్ ఆపుతున్నారని, ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేయక పోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబిఐ దర్యాప్తు డిమాండ్ చేసిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
48 గంటల్లో విచారణ జరిపిస్తామన్న కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు దాక్కున్నాడని నిలదీశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. కేసులను సీబీఐకి ఇస్తే క్షేత్రస్థాయి నుంచి సీబీఐ దర్యాప్తు చేస్తుందన్నారు. కిషన్ రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవన్నారు. ఆయన కేటీఆర్ నుంచి సలహాలు తీసుకుంటారని పేర్కొన్నారు.
కవిత వ్యవహారం వారి కుటుంబ వ్యవహారం అన్నారు. అధికారం ఆస్తి పంపకాల విషయం అని కొట్టి పారేశారు. తమకు సంబంధం లేని విషయమన్నారు. నలుగురు కలిసి కవితపై దాడి చేస్తున్నారని ఆవేదన చెందారరు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కవితను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ టాపింగ్ కేసు కోర్టు పరిధిలో ఉందని, కాబట్టి సీబీఐ కి వెళ్ల లేదన్నారు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు రాష్ట్రపతి రిఫరెన్స్ అంశంపై తీర్పు ఆధారంగా ముందుకు వెళతాం అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు సామాజిక బహిష్కరణ చేశారని అన్నారు. వందలాది మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు అంశం కృష్ణ ట్రిబ్యునల్ చూసుకుంటుందని చెప్పారు.