
నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్
హైదరాబాద్ : ఘనమైన చరిత్ర కలిగిన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం. పెను ప్రభంజనం రామ్ గోపాల్ వర్మ. ఉన్నట్టుండి తన చేతిలో రూపు దిద్దుకున్న సినిమా శివ. అది మూస ధోరణితో కొనసాగుతూ వస్తున్న సినిమాలను తోసి రాజని టాప్ లో నిలిచింది. కాసుల వర్షం కురిపించింది. సినిమా అంటే ఇలా కూడా తీస్తారా అన్నంతగా చిత్రీకరించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎవరైనా టాలీవుడ్ గురించి చెప్పాలంటే శివ మూవీ కంటే ముందు శివ వచ్చిన తర్వాత మాట్లాడేలా చేసిన ఘనత ఒక్క ఆర్జీవీకే దక్కుతుంది. అద్భుతమైన టేకింగ్, అంతకు మించిన డైలాగులు, సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , చిత్రీకరణ ఆకట్టుకునేలా చేసింది. రికార్డుల మోత మోగించింది. శివ లక్షలాది మందిని ప్రభావితం చేసింది కూడా. ఆ తర్వాత నాగార్జున టాప్ హీరోగా, రామ్ గోపాల్ వర్మ తన పవర్ ఏమిటో చూపించేలా చేసింది.
ఇదిలా ఉండగా ఇందులో కీలక పాత్ర పోషించిన నాగార్జున శనివారం కీలక ప్రకటన చేశాడు. తన తండ్రి దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావుకు నివాళిగా వచ్చే నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా తాను నటించిన శివ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించాడు. నా ప్రియమైన తండ్రి ఏఎన్ఆర్ పుట్టిన రోజున భారతీయ సినిమాను మళ్ళీ థియేటర్లలో తిరిగి షేక్ చేయడానికి శివ వస్తున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. సినిమాకు తరాలను దాటి జీవించే శక్తి ఉందని నా తండ్రి ఎప్పుడూ నమ్మేవాడు, శివ అలాంటి సినిమాలలో ఒకటి. ఆరోజు శివ సినిమా కొత్త 4K డాల్బీ అట్మాస్‌లో రాబోతోందని తెలిపాడు. కథలను శాశ్వతంగా సజీవంగా ఉంచాలనే అతని కలకు ఇది నివాళి అని స్పష్టం చేశాడు నాగ్.