బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని, రౌడీలు, గూండాలు, మాఫియాల చేతుల్లో అధికారం కొనసాగుతోందని మండిపడ్డారు. మంత్రుల మధ్య కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం జరిగిన బండారం బయట పడిందన్నారు. ఏది ఏమైనా మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో తన కూతురు కొండా సుష్మితా పటేల్ చేసిన ఆరోపణలు చాలా దగ్గరగా ఉన్నాయని, ఈ దెబ్బతో మొత్తం గూడు పుఠాణి, బండారం ఒక్కసారిగా బయట పడిందన్నారు. ఈ మాఫియా టీంకు సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉన్నాడని తేలి పోయిందన్నారు. ఎలాంటి పదవులు లేక పోయినా సీఎం సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డిలకు ఎలా గన్ మెన్ లు ఇస్తారని ప్రశ్నించడాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
దెక్కన్ సిమెంట్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి, మంత్రులు నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ నమ్మిన బంటు సుమంత్ ల మధ్య ఎందుకు వివాదం కొనసాగింది, వారి మధ్య ఉన్న పంచాయతీ ఏమిటనేది కూడా బయటకు రావాలన్నారు. ఈ గూడు పుఠాణి గురించి పూర్తిగా వివరాలు తెలియాలంటే రోహిన్ రెడ్డి, సుమంత్ ల మధ్య జరిగిన కాల్ లిస్టును బయట పెట్టాలని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అసలు రోహిన్ రెడ్డికి, సుమంత్‌కి ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. ఈ తలల మీద పిస్టల్ పెట్టి పంచాయితీలు చేసుడు ఏందంటూ మండిపడ్డారు. అసలు ఒక సివిలియన్ చేతికి పిస్టల్ ఎలా వచ్చిందని నిలదీశారు.






