కేసీఆర్ దూర దృష్టికి నిదర్శనం పార్క్
హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో హ్యూవెల్ సంస్థ చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆనాడు టెస్ట్ చేయాలంటే కనీసం రూ. 6500కు పైగా ఉండేదన్నారు. ఎక్కడా దొరికేవి కావన్నారు. కానీ హ్యూవెల్ సంస్థకు చెందిన శిశిర్ , రచన , వారి బృందం మొత్తం కలిసి అప్పట్లో రూ. 6,000 ఖర్చయ్యే ఒక టెస్ట్ ధరను కేవలం రూ. 12కు తగ్గించామని చెప్పడం అద్భుతమని కొనియాడారు. పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ వంటి ఉత్పత్తుల ద్వారా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే పరిశోధనలు, కార్యక్రమాలు చేస్తున్నందుకు కేటీఆర్ హ్యూవెల్ బృందాన్ని అభినందించారు. సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం, దాని వల్ల వ్యర్థం అని కేసీఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారని కేటీఆర్ ఈ సందర్బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సాంకేతికత (టెక్నాలజీ) ఉన్నా దాని వల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని కేసీఆర్ సందేశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. హ్యూవెల్ సంస్థకు ఇది పదవ వార్షికోత్సవం సందర్భంగా కేటీఆర్ బృందాన్ని ప్రశంసలు కురిపించారు. మీరు కూడా మాతో కలిసి హైదరాబాద్‌ని, తెలంగాణాని, భారతదేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను అని కేటీఆర్ ఆకాంక్షించారు. మరో రెండేళ్లలో మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.






