సంచలన కామెంట్స్ చేసిన హరీశ్ రావు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చేశారంటూ ఆరోపించారు. కొత్తగా హ్యామ్ మోడల్ అంటున్నారని, ఇది కేవలం కమీషన్లు దండుకోవడం తప్పా మరోటి కాదన్నారు. ఇప్పటికే రేవంతు పాలనలో అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందన్నారు. సివిల్ సప్లైలో అప్పులు పేరుకు పోయాయని, ట్రాన్స్‌కో డిస్కంలను అప్పుల కుప్పలుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్బీఎం అప్పులు గత పదేళ్లలో ఎన్నడూ తేనంత అప్పులు తెచ్చారని మండిపడ్డారు హరీశ్ రావు. కాంట్రాక్టర్లకు లబ్ధి కోసం, కమీషన్లు దండుకునేందుకు హ్యాం మోడళ్లు పిలిచారంటూ ధ్వజమెత్తారు. రూ. 10,547 కోట్లతో టెండర్లు పిలిచి, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమీషన్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
శనివారం తెలంగాణ భవన్ లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. తమ పాలనలో రోడ్లు వేయలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు ప్రతి గ్రామానికి రోడ్డు వేసిందన్నారు. ప్రతి మండల కేంద్రంకు, జిల్లా హెడ్ క్వార్టర్లకు రోడ్లు వేసింది తామేనని అన్నారు. హ్యాం పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోతే జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేశాడని ఆరోపించారు. పేద, మధ్య తరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి అని భగ్గుమన్నారు హరీశ్ రావు. లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల రక్తం పీల్చుతున్నారంటూ నిప్పులు చెరిగారు. హ్యాం మోడల్ అనేది ఒక బోగస్. దాని పేరు చెప్పి కమీషన్లు దండుకోవడమే తప్ప ప్రభుత్వం చేస్తున్నదేం లేదన్నారు.






