శ్రీలంక దేశ ప్రధానమంత్రి హరిణి అమరసూర్య
ఢిల్లీ : మహిళా సాధికారత, అభివృద్ది సహకారం దిశగా భారత్, శ్రీలంక దేశాలు ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు శ్రీలంక దేశ ప్రధానమంత్రి హరిణి అమర సూర్య. ఇండియాలో ఆమె పర్యటిస్తున్నారు. ఎన్డీటీవీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ సమ్మిట్ లో పాల్గొన్నారు శ్రీలంక ప్రధాని హరిణితో పాటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతకు ముందు పీఎం నివాసంలో ఈ ఇద్దరు కీలక నేతలు భేటీ అయ్యారు. దాదాపు 2 గంటలకు పైగా కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా విద్య, మహిళా సాధికారిత, ఆవిష్కరణలు, అభివృద్దితో పాటు మత్స్యకారుల సంక్షేమం వంటి కీలక విషయాలు చర్చకు వచ్చాయని ఈ సందర్బంగా తెలిపారు ప్రధానమంత్రి డాక్టర్ హరిణి అమరసూర్య.
గత సంవత్సరం పీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశానికి తొలిసారిగా వచ్చారు అమరసూర్య. రెండు రోజుల ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ప్రారంభ రోజున ‘అనిశ్చిత కాలంలో మార్పు దిశానిర్దేశం’ గురించి మాట్లాడారు. అనిశ్చితిని ఊహతో ఎదుర్కోవడానికి, సంకల్పాన్ని ప్రతిచర్యగా కాకుండా ఉద్దేశపూర్వక ఉద్దేశ్యంగా చూడటానికి, పునరుద్ధరణను గతానికి తిరిగి రావడంగా కాకుండా ఇంకా నిర్వచించ బడని భవిష్యత్తుల సృష్టిగా స్వీకరించడానికి ఇది ఒక ఆహ్వానంగా తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రపంచ నాయకులు, ఆలోచనాపరులతో నిమగ్నమయ్యే అవకాశం నాకు లభించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీలంకతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై అర్థవంతమైన సంభాషణలకు దోహద పడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.






