రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్
హైదరాబాద్ : సనత్ నగర్ లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్ ) నెల రోజుల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. టిమ్స్ లో 30 విభాగాలు కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో రోగులకు సేవలు అందిస్తాయని తెలిపారు. ఈ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో నిర్వహిస్తామని అన్నారు. గురువారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, అదనపు కలెక్టర్ జి . ముకుంద రెడ్డి, రహదారులు , భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్లు రాజేశ్వర్ రెడ్డి ,లింగారెడ్డి, ఎంఈఐఎల్ ప్రాజెక్ట్ మేనేజర్లు జి ఏ కే స్వామి నాయుడు, వి.శ్రీనివాసరావులతో కలిసి సనత్ నగర్ టిమ్స్ తో పాటు, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. టిమ్స్ లోనిర్మాణం పూర్తి ఐన భవనాలు, వైద్య పరికరాల అమరిక తదితరాలను పరిశీలించారు.
ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయో ఆరా తీశారు. టిమ్స్ , ఉస్మానియా ఆసుపత్రులను నిర్మిస్తున్న ఎం ఈ ఐ ఎల్ తరపున ప్రాజెక్ట్స్ విభాగం అధ్యక్షుడు కే గోవర్ధన్ రెడ్డి నిర్మాణం వివరాలను వికాస్ రాజ్ తో పాటు కలెక్టర్ హరి చందన తదితరులకు వివరించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ సనత్ నగర్ టిమ్స్ ప్రారంభానికి 15 రోజుల్లో సిద్ధం అవుతుందన్నారు. దీని ప్రారంభ తేదీని త్వరలో నిర్ణయిస్తామని అన్నారు. నెల రోజుల్లో ఇక్కడి నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభం అవుతాయన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు మాదిరిగా ఇక్కడ సేవలు అందించటంతో పాటు నిర్వహణ కూడా ఉంటుందని చెప్పారు. టిమ్స్ నిర్మాణానికి ఎలాంటి నిధుల కొరత లేదని చెప్పారు. ప్రభుత్వం నెల వారీ నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. తెలంగాణాలో నిర్మిస్తున్న టిమ్స్ , వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య, వైద్యేతర సిబ్బంది నియామకానికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకొంటోందని వివరించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్న గడువులోగా భవనాల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారని చెప్పారు. ఈ ఆసుపత్రి భవనాల నిర్మాణానికి కూడా ఎలాంటి నిధుల కొరత లేదన్నారు.






