అనుమతి ఇచ్చిన స్పీకర్ కు బుద్ది లేదు
తాడేపల్లి గూడెం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోజు అసెంబ్లీలోకి బాలకృష్ణ తాగి వచ్చాడని అన్నారు. అసలు స్పీకర్ చింకాయల అయ్యన్న పాత్రుడికి బుద్ది అనేది ఉందా అంటూ ప్రశ్నించారు. తనను ఎందుకు అనుమతి ఇచ్చారో చెప్పాలన్నారు. ఇలాంటి వాళ్ల వల్లనే శాసన సభకు ఉన్న గౌరవం లేకుండా పోతోందన్నారు. అసెంబ్లీలో ఆలా మాట్లాడుతున్నారు అంటే సైకలాజికల్ హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలికారు. ఇదే సమయంలో ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్నారు. పచ్చి అబద్ధాలకు, వ్యవస్థీకృత పద్ధతిలో నకిలీ మద్యం రాకెట్‌ను నడుపుతున్నందుకు, కేంద్ర దర్యాప్తును తప్పించు కునేందుకు, డేటా సెంటర్ ప్రాజెక్ట్ గురించి అబద్ధాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు జగన్ రెడ్డి.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. YSRP ఈ ప్రాజెక్టుకు బీజం వేసినప్పటికీ, చంద్రబాబు డేటా సెంటర్ గురించి తప్పుడు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. క్రెడిట్‌ను హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ సైబర్ టవర్స్‌కు క్రెడిట్ తీసుకున్నట్లే, అతను మళ్ళీ తన పాత పాట పాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పదే పదే సైబర్ టవర్ , సైబరాబాద్ గురించి పదే పదే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దివంగత ఎన్. జనార్దన్ రెడ్డి వల్లనే ఐటీ ఇక్కడికి వచ్చిందని , ఆ విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు జగన్ రెడ్డి. గూగుల్, అదానీ వ్యాపార భాగస్వామ్యులని , డేటా సెంటర్ ఏర్పాటుకు తాను ఉన్నప్పుడే ప్రయత్నం చేశానని చెప్పారు.






