పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. శనివారం హైదరాబాద్ లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఆమె ప్రసంగించారు. అమర వీరులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే కేవలం 580 మందికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు. మిగతా వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాను పదే పదే వారికి న్యాయం చేయాలని కోరానని చెప్పారు. అమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణ కోరుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ యావత్ బాగుండాలనే అమరులు వారి ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు.
ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే విధంగా పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నానని ప్రకటించారు కవిత. ఈ ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మార్చైనా సరే, ప్రభుత్వంతో నైనా వారికి న్యాయం జరిగేలా చేస్తానని అమరుల పాదాలకు నమస్కరించి చెబుతున్నానని చెప్పారు. ఉద్యకారుల లిస్ట్ మొత్తాన్ని ప్రజాదర్భార్ పెట్టుకొని తయారు చేద్దామని పిలుపునిచ్చారు. ఆ ఉద్యమ కారులందరికీ పెన్షన్ వచ్చే వరకు విరామం లేకుండా తాను పోరాటం చేస్తానని వెల్లడించారు. 33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో ‘జనం బాట’ పేరుతో జనం కోసం బయలుదేరుతున్నానని చెప్పారు కవిత.






