స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ముంథా తుపాను ముంచుకొస్తుండడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. దుబాయ్ పర్యటన ముగించుకుని అమరావతికి వచ్చారు. ఆ వెంటనే ఆయన సచివాలయంలో అత్యవసర సమీక్ష చేపట్టారు సీఎం. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం కావాలని పేర్కొన్నారు. సహాయక చర్యలు ముమ్మురం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు పెద్ద ఎత్తున ముందస్తుగా నిధులు మంజూరు చేశామన్నారు సీఎం. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు . చిన్న పిల్లలు అంగన్వాడికి కేంద్రానికి రాకుండా వారికి ఇవ్వవలసిన పాలు గుడ్డు తదితర పోషకాహారాలను వారి ఇంటి వద్దకే చేరవేయాలని స్పష్టం చేశారు.
గొర్రెలు, మేకలు తదితర పశువుల పెంపకం దారులు వారి ఇంటి వద్దనే ఉంచుకునేలా సమాచారం పంపించాలన్నారు సీఎం. పునరావస కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్న ప్రదేశాల్లో ఆహారం వండేందుకు పంటవాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వచ్చే వారంలో ప్రసవించనున్న గర్భవతులను రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, డయాలసిస్, కిమోతెరపి రోగులను కూడా ముందుగానే ఆసుపత్రులలో చేర్పించాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. రహదారులు గాని వంతెనలు గాని కాజ్వేలు గాని గండిపడే అవకాశం ఉన్నచోట రాకపోకలు జరగకుండా సిబ్బందిని నియమించి నియంత్రించాలని ఆదేశించారు. గాలికి పడిపోయే బలహీనంగా ఉన్న హోర్డింగులను గాని పాత ఫ్లెక్సీలు గాని తొలగించాలన్నారు. వాహనాల రవాణా కోసం ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.






