రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్
కరీంనగర్ జిల్లా : అకాల వర్షాల కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు కవిత. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయక పోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.
వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. పదివేలు పరిహారం ఇస్తామంటే ఏ మూలకు సరిపోదని అన్నారు కవిత. రైతులకు మేలు జరగాలంటే ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు సర్కార్ ను. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువ ఉన్నా సరే ధాన్యం కొనుగోలు చేయాలని, అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆదుకోవాలని కోరారు కవిత. పంటలకు ముందస్తుగా బీమా చేసి ఉంటే , కిస్తులు ప్రభుత్వం కట్టి ఉంటే ఈ ఇబ్బంది తలెత్తి ఉండేది కాదన్నారు. ఇకనైనా సర్కార్ ముందస్తుగా నివేదికలు తయారు చేయాలని, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.






