నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్రమాలకు మూడు నాలుగు నెలల ముందే రేవంత్ రెడ్డి తెరతీశారని ఆరోపించారు. తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 20 వేల దొంగ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని ఆధారాలతో సహా నిరూపించినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీవిజిల్ యాప్ పని చేయలేదని, ఇంత కన్నా ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. 13 సంవత్సరాల అమ్మాయితో కూడా కాంగ్రెస్ నేతలు ఓటు వేయించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డితో ఎన్నికల కమిషన్ కుమ్మక్కైందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
దొంగ ఓట్లకు పోలీసులు సహకరించారని, దొంగ ఓటర్లను బీఆర్ఎస్ పట్టిస్తే చర్యలు తీసుకోలేదని వాపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజాస్వామ్యాన్ని రేవంత్ హత్య చేశారని అన్నారు. రేవంత్ ఎన్ని అక్రమాలు చేసినా కేసీఆర్ వైపే ప్రజలు ఉన్నారని తేలి పోయిందన్నారు. బైండోవర్ చేసిన చిన్న శ్రీశైలం యాదవ్ యథేచ్ఛగా ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. తమ పార్టీ నేతల మీద చిన్న శ్రీశైలం దాడులు చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదని నిలదీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పాతబస్తీ నుంచి ఓటర్లను తెప్పించి ఓట్లు వేయించారని అన్నారు. ఎంఐఎం ఇందుకు సహకరించిందన్నారు. తమ నేత హరీష్ రావు సమస్యాత్మక పోలింగ్ బూతుల జాబితా సీఈఓకు ఇచ్చినా చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు.






