ప్రశంసించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ : హైదరాబాద్ లో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం అందుకున్నానని దీనిని తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అశేష భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర కోటి దీపోత్సవాన్ని గత 14 ఏళ్లుగా నిరంతరం నిర్వహిస్తున్న ఎన్టీవీ నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తరఫున ఇటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ముఖ్యమంత్రి కార్తీక మాసంలో కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర అధికారిక పండుగగా నిర్వహిస్తామని ప్రకటించడం మన సంస్కృతికి మరింత గౌరవం తెచ్చేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఒక శుభవార్త చెప్పారు మంత్రి. మన్ననూరు–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌ను తమ ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. సుమారు ఎనిమిది వేల కోట్ల వ్యయంతో రూపొందిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను ప్రశంసలు కురిపించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.






