రాబోయే కాలం మనదేనన్న ఈటల రాజేందర్
హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని , పని చేసుకుంటూ పోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓడి పోవడం, డిపాజిట్ రాక పోవడం పట్ల స్పందించారు. తెలంగాణ వచ్చిన తరువాత 9 ఉప ఎన్నికలు జరిగితే 7 సార్లు అధికార పార్టీనే గెలిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో హస్తం గెలిచిందని అన్నారు ఎంపీ. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టీ మరీ గెలిచారంటూ ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని చేశారో వీరు కూడా అవే చేశారని అన్నారు. కాంగ్రెస్ కి హుజురాబాద్ లో 3016 ఓట్లు వచ్చాయని, దుబ్బాకలో , మునుగోడు డిపాజిట్ కోల్పోయిందన్నారు. మరి డిపాజిటు కోల్పోయిన పార్టీ మొన్న ఎలా అధికారంలోకి వచ్చింది. ఒక్క బై ఎలక్షన్ ఓడిపోగానే బీజేపీ పని అయిపోతుందా ? రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరూ అలా మాట్లాడరని అన్నారు ఈటల రాజేందర్.
బీహార్ ఎన్నికలు ఒక ప్రభంజనం అన్నార. మహా ఘట్ బంధన్ అడ్రస్ లేకుండా పోయిందన్నారు ఎంపీ.
ఒళ్ళు వంచి పని చేస్తే విజయం మనదే నని ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి బాధకు గురి కావద్దని కోరారు . జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం అందరం బాధ్యత తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడం వల్లనే దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారని అన్నారు ఈటల రాజేందర్. గెలిస్తే బీజేపీ వాళ్ళు EVM లను ఏదో చేశారని అంటున్నారు.. మరి జూబ్లీహిల్స్ లో ఇవిఎం మేనేజ్ చేశారా ? దొంగ ఓట్లు నమోదు చేయించారా అని ప్రశ్నించారు. తెలంగాణలో, కర్ణాటకలో కూడా మీరే గెలిచారు మరి అక్కడ కూడా అలానే చేశారా ? మీరు గెలిస్తే ఒక న్యాయం.. మేము గెలిస్తే ఓట్ చోరీ అని అంటారా ? ఏం చేస్తావో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. ఇలాంటి ఆరోపణలు కాదు. బరిగీసి కొట్లాడే తత్వం లేనప్పుడు పార్టీ ముందుకు పోయే అవకాశం లేదన్నారు.






