విచారణకు గవర్నర్ అనుమతి
హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించాలని అనుకుంటోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సమయంలో ఉన్నట్టుండి తెర పైకి మరోసారి ఫార్ములా వన్ కార్ రేసు కేసు ముందుకు వచ్చింది. ఇదే కేసుకు సంబంధించి పలుమార్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ముందు హాజరయ్యారు. తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని ఈ సందర్బంగా పదే పదే చెబుతూ వచ్చారు. అయితే ఈ కేసులో రూ. 54.88 కోట్లు చేతులు మారాయని ఏసీబీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని అంటోంది.
ఇదిలా ఉండగా కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమయంలో తనను అరెస్ట్ చేయాలంటే ముందుగా స్పీకర్, గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విచారణ జరిపేందుకు, అదుపులోకి తీసుకునేందుకు తమకు ఛాన్స్ ఇవ్వాలని ఏసీబీ ఇప్పటికే గవర్నర్ ను కలిసి విన్నవించింది. ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించింది. ఇందులో భాగంగా ఫైల్ ను పరిశీలించిన గవర్నర్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్ ను విచారణ జరిపేందుకు గాను ఏసీబీకి అనుమతి ఇచ్చారు. దీంతో తనపై ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు రెడీ అయ్యింది ఏసీబీ. దీంతో తన అరెస్ట్ తప్పదని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.





