ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు
ముంబై : ఏపీ సర్కార్ సినీ, పర్యాటక రంగాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపూర్వమైన అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశాల్లో వివరించారు. పర్యాటక, ఆతిథ్య రంగాలకు ‘ఇండస్ట్రీ స్టేటస్’ సర్కార్ ఇచ్చిందన్నారు. భూమి కొనుగోలు లీజుపై 100% స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల మినహాయింపు, 15 సంవత్సరాలకు 100% SGST రీయింబర్స్‌మెంట్ వంటి లాభదాయకమైన రాయితీలను కల్పిస్తున్నట్లు తెలిపారు. MSME ప్రాజెక్టులకు 25% వరకు, మెగా ప్రాజెక్టులకు 10% వరకు ప్రత్యక్ష మూలధన సబ్సిడీలు అందుబాటులో ఉండటం పెట్టుబడిదారులకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయన్నారు. అంతేకాక హోటళ్లు, రిసార్టులకు పారిశ్రామిక రేట్లకే విద్యుత్, ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకం మినహాయింపు అందించడం వల్ల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు.
స్వర్ణాంధ్ర విజన్–2047 లో భాగంగా, AI, VFX, గేమింగ్ రంగాలను అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ‘ఆంధ్రా వ్యాలీ’గా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు కందుల దుర్గేష్. సినిమాటోగ్రఫీని, పర్యాటకాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని సమన్వయం చేస్తూ ఏపీ అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో కృషి చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, అరకు, లంబసింగి, శ్రీశైలం, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాలను ప్రధాన యాంకర్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తూ 21 థీమాటిక్ సర్క్యూట్‌లలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.








