కమిషనర్ ను కలిసిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు . ఆమె సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈసీ ఎన్నికల కోడ్ ను విధించిందన్నారు. ఈ సమయంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభలు నిర్వహించ కూడదని ఆ విషయం తెలిసినా పట్టించు కోవడం లేదంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమే కాకుండా ప్రభుత్వ ధనం వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు కవిత. ఈ సందర్భంగా వినతి పత్రం అందజేశారు.
మక్తల్, కొత్తగూడెం సభల్లో సర్పంచులుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండి పనులు చేయించే వారిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని చెప్పారు. ఎన్నికల కోడ్ ను ముఖ్యమంత్రి పూర్తిగా ఉల్లంఘించారంటూ ఆరోపించారు. ప్రజా ధనాన్ని వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రిపై ఇదివరకే తెలంగాణ జాగృతి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వచ్చిందని తెలిపారు. నవంబర్ 30వ తేదీన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిందని చెప్పారు కల్వకుంట్ల కవిత. ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి ప్రచారాన్ని నిలుపుదల చేయించాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని ఈసీని కోరారు.






