ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎంతో మంది త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు, ఆందోళనలు చేపట్టినందు వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రత్యేకించి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది శ్రీకాంతాచారి అని గుర్తు చేశారు. ప్రధానంగా డిసెంబర్ 3న ఎప్పటికీ మరిచి పోలేమన్నారు. శ్రీకాంతా చారి ఆశయ సాధనలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు పారదర్శక పాలన సాగిస్తున్నామని అన్నారు సీఎం. తాము కొలువు తీరి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు రేవంత్ రెడ్డి.
రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా వంటి వ్యవసాయ రంగంలో 1.04 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)తో స్వయం సహాయక సంఘాలకు 445 బస్సులను కేటాయించామన్నారు. దేశంలో ఇలాంటి నిర్ణయం ఏ రాష్ట్ర సర్కార్ తీసుకోలేదన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , తుమ్మల నాగేశ్వర్ రావు, వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.






