ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న భూ సంబంధిత సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాం నుంచి చోటు చేసుకున్న అక్రమాలను వెలికి తీసేందుకు గాను చర్యలు చేపట్టామన్నారు. ఇంత వరకు రెండు జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోందని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వాటి ఫలితాలను గమనించి, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అక్రమార్కుల భరతం పడతామని హెచ్చరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లెక్కలేనంతగా భూ అక్రమాలు చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చాయన్నారు. అందుకే విచారణకు ఆదేశించడం జరిగిందని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొత్తగా భూ యజమానులకు వీలుగా , మేలు జరిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రత్యేకంగా యాప్ ను తయారు చేయిస్తున్నామని చెప్పారు. ఈ కీలక సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.






