ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు, కంపెనీల చైర్మన్లు, కన్సల్టెంట్స్ హాజరవుతారు. ఈ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తారు. రెండో సెషన్ లో సీఎం రేవంత్ రెడ్డ ప్రసంగిస్తారు. సెషన్ల తర్వాత సంగీత కార్యక్రమాలు ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి అతిధులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది.
మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దమయ్యాయి. ఇక అతిధులను తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లకు కూడిన బహుమతిని ప్రభుత్వం తరపున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో పాటు, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలను ఈ సావనీర్ లో పొందుపరుస్తారు. అలాగే తెలంగాణకే ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్ ను కూడా అతిధులకు అందించనున్నారు.






