కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచిందని ప్రశంసలు కురిపించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నామని చెప్పారు. బుధవారం ఓయులో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
గత పదేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని అంటున్నారని, కానీ నేను ఏనాడూ గుంటూరులో చదువు కోలేదన్నారు. తనకు గూడు పుఠానీ చేయడం రాదన్నారు.
నాకు విదేశీ భాష రాక పోవచ్చు.. కానీ నాకు పేదవాడి మనసు చదవడం వచ్చని అన్నారు రేవంత్ రెడ్డి.
పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు అని చెప్పారు. పేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. చేతనైతే ఆర్ట్స్ కాలేజీకి రమ్మని ఒకాయన గతంలో సవాల్ విసిరాడు . నాకేం ఫామ్ హౌసులు లేవు.. నేనేం ప్రజల సొమ్ము దోచుకోలేదని అన్నారు.
బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డానని, ఇవాళ మీతో ఇలా మాట్లాడుతున్నానని చెప్పారు సీఎం. చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే నా ఆకాంక్ష అని స్పష్టం చేశారు. రెండేళ్లల్లో మీరేం చేశారని కొందరు అడుగుతున్నారు.జయ జయహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెడితే రాష్ట్ర గీతంగా గుర్తించాం .పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు .బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నాం .
ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేశామన్నారు. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం .విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలుగుతుందని అన్నారు.






