అధికారుల పనితీరు మార్చుకోవాలి
అమరావతి : పని విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. టెక్నాలజీ ఆడిటింగ్ తో పాటు ఆఫీసర్ల వ్యవహరశైలి మారితే ప్రజలు సంతృప్తి చెందుతారని అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవడమే కాదు… ఫలానా అధికారి, ఫలానా విభాగం బాగా పని చేస్తుందని ప్రజలే చెప్పే స్థాయిలో అధికారులు పని చేయాలన్నారు. అంతా కలిసి పని చేస్తే మూడు నెలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రజారోగ్యం విషయంలో అధికారులు అలెర్టుగా ఉండాలన్నారు. నీటి సరఫరా లోపాల వల్ల వ్యాధుల వచ్చే పరిస్థితి ఉండకూడదని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఆయా శాఖలకు చెందిన అధికారులనే బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారు.
ప్రజలకు సేవలందించే విషయంలో సమాచారాన్ని క్రోడీకరించి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు సీఎం. ఈ విషయంలో అధికారుల్లో పోటీతత్వం పెరగాలి. దీని కోసమే మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి డేటా లేక్ వ్యవస్థను తెచ్చామన్నారు. అవేర్ ద్వారా 42 అంశాల్లో ప్రజలకు సమాచారం అందించేలా కార్యాచరణ చేశామన్నారు. ప్రతీ విభాగం శాటిలైట్ డేటాను వినియోగించుకుని ప్రజలకు మేలు జరిగేలా ఆ సమాచారాన్ని వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం 800కు పైగా సేవలు వాట్సప్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు సీఎం. మిగతా 383కు పైగా సేవలు కూడా ఈ పరిధిలోకి వస్తే 1200 సేవలు వాట్సప్ గవర్నెన్సు ద్వారా అందించే అవకాశం ఉంటుందన్నారు.






