మంత్రి వంగలపూడి అనిత ప్రకటన
అమరావతి : రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి పారదర్శకంగా కానిస్టేబుళ్ల రాత పరీక్ష నిర్వహించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియలో పూర్తి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం జరిగిందని అన్నారు. ఈ పరీక్ష ద్వారా 5,500 మంది కొత్తగా కానిస్టేబుళ్లుగా కొలువు తీరనున్నారని పేర్కొన్నారు. నేరం జరగక ముందే ప్రీవెంటింవ్ విధానం అమలు చేయాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేశారు వంగలపూడి అనిత. న్యాయ వ్యవస్థను పటిష్ట పరిచేలా ఇన్వెస్టిగేషన్ లోనూ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నామని చెప్పారు. సీసీటీవీ, డ్రోన్స్, ఫింగర్ ప్రింట్స్ సహా ఫోరెన్సిక్ టెక్నాలజీని ఆధునీకరించి వినియోగిస్తున్నాం అన్నారు.
కాగా తాజాగా ఎంపికైన కానిస్టేబుళ్లలో శ్రీకాకుళం, విజయనగరం వారే ఎక్కువ మంది ఉన్నారని వెల్లడించారు మంత్రి వంగలపూడి అనిత. గతంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్లను, ఆర్మడ్ రిజర్వు సహ పోలీసులుగానూ మహిళల్ని చంద్రబాబు ప్రోత్సహించారని చెప్పారు. శక్తి టీమ్స్, శక్తి వాహనాలు, యాప్ లు ఏర్పాటు చేసి మహిళల రక్షణను పటిష్ట పరిచామని అన్నారు. ఖాకీ చొక్కా ప్రజలకు ఓ భరోసా కావాలి. ప్రజలందరికీ భద్రతను కల్పించటమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పగలు, రాత్రి, పండగ పబ్బం లేకుండా పని చేయాల్సిన విధుల్లో పని చేయబోతున్న వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.





