మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన ఇటీవలే ఉప్పాడ తీర ప్రాంతాన్ని సందర్శించారు. మత్స్యకారులకు మెరుగైన శిక్షణ ఇప్పిస్తానని చెప్పారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పర్చేందుకు ప్రకటించిన 100 రోజులు ప్రణాళికలో భాగంగా అధ్యయనం, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అవలంభిస్తున్న సాంకేతికత సాయంతో ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులకు వసతులు కల్పించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యశాఖ అధికారులకు సూచించారు. ఇందుకు అనుగుణంగా మత్స్య సంపదతో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరం అయిన అధునాతన పద్దతులపై అధ్యయనం చేసేందుకు ఉప్పాడకు చెందిన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపారు.
ఈ నెల 8వ తేదీన మొత్తం 60 మంది రెండు బృందాలుగా ఆయా రాష్ట్రాలకు వెళ్లారు. స్థిరమైన ఆర్ధికాభివృద్ధి సాధించడం ఎలా అనే అంశంపై రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. అధునాతన కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, మార్కెటింగ్ వ్యవస్థల ఏర్పాటు, అన్ని హంగులతో నిర్మించిన హార్బర్ల సందర్శన, హ్యాచరీల్లో చేపల గుడ్లు పొదిగించడం, వలల తయారీ తదితర అంశాల్లో సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSMCRI), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ (NIPHT)లతో శిక్షణ ఇప్పించారు. మొదట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అక్కడ అమలు చేస్తున్న విధానాలను వివరించారు. తదుపరి క్షేత్ర స్థాయిలో సందర్శనలకు ఏర్పాటు చేశారు.





