డిమాండ్ చేసిన బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్
న్యూఢిల్లీ : గత రెండు రోజులుగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీసీ జేఏసీ నేతలు బుధవారం కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిశారు. బీసీ డిమాండ్లపై పది నిమిషాలు చర్చించారు . ఈ సందర్భంగా ఐదు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు ఈ సందర్బంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం డేడికిషన్ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. దాని ద్వారా మొదటిసారి సమగ్ర కులగనన చేపట్టారని తెలిపారు. తదుపరి బీసీ లకు విద్యా , ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిజెపి, టీఆర్ఎస్, సిపిఐ, ఎంఐఎం టీజేఎస్ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా చట్టాన్ని ఆమోదించి ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు .
బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు చెల్లదని న్యాయస్థానాలు అడ్డు పడుతున్నాయని ఆరోపించారు.
సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీలులేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాలలోనే రాజ్యాంగాన్ని సవరించి 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణలో అత్యధిక శాతం బీసీ జనాభా ఉన్నా అన్ని రంగాలలో అన్యాయం జరుగుతోందని అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టానికి టిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపిందని చెప్పారు.
అసెంబ్లీలో చేసిన చట్టం 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఆమోదం పొందడం లేదని అందుకే ఈ పార్లమెంటు సమావేశాలలో టిఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టామని చెప్పారు.






