టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
విజయవాడ : పరకామణి చిన్నకేసు అని అవహేళన చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య . తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలను బట్టి ఈ దొంగతనం అంతా ఆద్యంత్యం జగన్ కు తెలిసినట్లుగా కనిపిస్తుందన్నారు. బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, ఆప్తుడు భూమనను రక్షించేందుకే జగన్ తాపత్రయం తప్పా మరోటి కాదన్నారు. చంబల్ బందిపోట్లు, కంజర భట్ ముఠాల దోపిడీల కంటే పరకామణి దొంగతనమే అత్యంత ప్రమాదకరం అన్నారు వర్ల రామయ్య. కోట్లాది హైందవ భక్తులకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సైతం పరకామణి కేసు దర్యాప్తు గురించి విస్మయం వ్యక్తం చేసిందన్నారు.
పరకామణిలో దొంగతనం జరగడానికి వీలు లేదని అన్నారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని మరోసారి హైకోర్టు గుర్తు చేసినట్లు ఆయన వివరించారు. పరకామణి కేసును గమనించిన హైకోర్టు ఎడిషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అధికారితో క్షుణంగా దర్యాప్తు చేయాలని ఆదేశించిందని చెప్పారు. పరకామణి కేసును అప్పటి అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు గోల్ మాల్ చేశారని ధ్వజమెత్తారు వర్ల రామయ్య. పరకామణి కేసు నిందితుడు రవికుమార్ నుంచి చట్టానికి వ్యతిరేకంగా రూ. 14.5 కోట్లు గిఫ్ట్ రూపంలో స్వీకరించిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ భారీ సొమ్ము వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసేందుకు జరిగిన ప్రయత్నాల వెనుక జగన్ హస్తం ఉందనేది స్పష్టమవుతోందని అన్నారు.






