ప్రశంసలు కురిపించిన చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ల పనితీరు సూపర్ గా ఉందంటూ ప్రశంసలు కురిపించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అమరావతిలో బుధవారం జరిగిన జిల్లాల కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో కంటే ఇప్పుడు పవన్, లోకేష్ లు పోటీ పడి పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పనితీరును కనబర్చాలని సూచించారు. ఇదిలా ఉండగా ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, చిన్నారులు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేలా చర్చించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల ద్వారా ఫలితాలు ఎలా వస్తున్నాయన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్లకు.
మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నాం… కానీ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు. 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషం అనిపించిందని సీఎం అన్నారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే… అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ. 3.90 కోట్లు మంజూరు చేయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చినా… పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని, మంత్రి లోకేష్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకు వచ్చారని ప్రశంసించారు. గత పాలకుల నిర్వాకం వల్ల నిర్వీర్యం అయిపోయిన కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ పునరుద్ధరించామని చెప్పారు.






