కేంద్ర సర్కార్ కు సీఎం చంద్రబాబు విన్నపం
ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. శుక్రవారం రాష్ట్రానికి చెందిన మంత్రులతో పాటు కేంద్ర మంత్రులతో కలిసి కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్ ను కలిశారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రధానంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు. ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగులో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు సీఎం. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా, ట్రిబ్యునల్ నిర్ణయాల అమలుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ అంశంపై తక్షణమే కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని భావిస్తోందని, దీనికి సంబంధించి భూసేకరణకు కూడా సిద్ధమైందని సీఎం అన్నారు. అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున కర్నాటక ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిలువరించాలని పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.





