ఏషియన్ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సిల్వర్ మెడల్ సాధించిన ఏపీలోని భీమవరానికి చెందిన శశాంక్ కనుమూరిని అభినందించారు. థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ క్రీడలో అద్బుతమైన ప్రతిభను చాటాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు. చివరకు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్బంగా తాను సాధించిన మెడల్ తో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా అమరావతిలోని సచివాలయంలో కలిశాడు.
ఈ సందర్బంగా టోర్నీలో తన అనుభవాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నాడు. గుర్రాలతో హర్డిల్స్ దాటే ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ లో తనకు పదేళ్ల అనుభవం ఉందని క్రీడాకారుడు శశాంక్ తెలిపారు. రాష్ట్రానికి పేరు తెచ్చిన క్రీడాకారుడు శశాంక్ కనుమూరి మరింతగా రాణించాలని ఆకాంక్షించారు నారా చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో బంగారు పతకాలతో రావాలని కోరారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు శశాంక్ కు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయమైనా చేసేందుకు సిద్దంగా ఉన్నామని, క్రీడపై మరింత పట్టు పెంచుకునేందుకు కృషి చేయాలని సూచించారు.








