ప్రముఖ సైకాలజిస్ట్, ట్రైనర్ కవిత తుమ్మలపల్లి
హైదరాబాద్ : రోజు రోజుకు జీవితం మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ సమయంలో మానవ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనే దానిపై చర్చ ఈమధ్యన పెరుగుతోంది. ఉరుకు పరుకుల ఒత్తిడిని ఎదుర్కోవడం ప్రతి ఒక్కరికీ అలవాటుగా మారడం ఒకింత ఆశ్చర్యం కలిగించినా ప్రపంచపు పోకడ ఇందుకు ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఈ క్రమంలో శారీరకంగానే కాదు మానసికంగా చితికి పోతున్న వారు ఎందరో. వారికి సాంత్వన కల్పించడం అనేది అత్యంత ముఖ్యం. గతంలో కుటుంబం ఒక అందరికీ, అన్నింటికీ ఒక కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు అది కనుమరుగు అవుతోంది. సభ్య సమాజానికి ఇది పెను సవాలుగా మారింది. దీని నుంచి బయట పడేందుకు, ఈ అనుకోని స్ట్రెస్ నుంచి తప్పించు కునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకొందరు ప్రశాంతతను కోరుకుంటే, మరికొందరు తమలో తాము ఒంటరితనంతో పెనవేసుకుని పోయి ఎవరో వస్తారని, ఇంకేదో తమకు ఆసరా అవుతారని అనుకుంటున్నారు.
ఇది అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. సమాజానికి పెను ముప్పుగా పరిణమించింది. టెక్నాలజీ పెరిగింది. ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. కానీ రాను రాను మానవ సంబంధాలు మరింత పలుచన అవుతున్నాయి. వీటని తిరిగి అతికించేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అంటోంది హైదరాబాద్ కు చెందిన , ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ సైకాలజిస్ట్ , కార్పొరేట్ ట్రైనర్ కవిత తుమ్మలపల్లి. ఇందు కోసం ఆమె ప్రత్యేకంగా మైండ్ సజెస్ట్ వెల్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఎందరికో కౌన్సెలింగ్ , థెరపీ ఇస్తున్నారు. వారిని మనుషులుగా తీర్చి దిద్దే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్బంగా ఎన్నో సెమినార్లు నిర్వహించారు. వేలాది మందికి శిక్షణ ఇస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ప్రత్యేకించి తను మానవ సంబంధాల గురించే ఎక్కువగా ప్రస్తావిస్తూ వాటిని కలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇందుకు కవితను అభినందించాల్సిందే. తనతో జరిగిన చిట్ చాట్ సందర్బంగా కీలకమైన అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు.
ఇదే సమయంలో కీలక సూచనలు కూడా చేశారు. దేనిని కోల్పోతున్నామని భావిస్తున్నామో దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మానసిక జాడ్యం నుంచి కొంత మేర విముక్తి పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుందని అంటారు. అన్ని సమస్యలకు మూలం కుటుంబం. ముందు దీనిలోంచే మార్పు మొదలు కావాలి. అప్పుడే ఎక్కడ మనం పొరపాట్లు చేశామో తెలుస్తుంది. ఆ తర్వాత ఎలాంటి మందులు లేకుండానే చితికి పోయిన మనుషులను బాగు చేసేందుకు వీలవుతుందని అంటారు కవిత తుమ్మలపల్లి. ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో వారు ఇప్పుడు వాటి నుంచి దూరం కావాలని కోరుకుంటున్నారు. దీని వల్ల పిల్లలకు సరైన ఆదరణ ఉండడం లేదు. వారికి దక్కాల్సిన సమయంలో ప్రేమ అందడం లేదు. అందుకే ఎవరూ ఊహంచని రీతిలో నేరాలు, ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రస్తుతం తల్లిదండ్రులు, పెద్దల మధ్యనే సరైన సమన్వయం లేకుండా పోతోంది. ఇది కూడా చిన్నారులు, విద్యార్థులు, యువతీ యువకులపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. మేం చెప్పినా వాళ్లు వినిపించు కోవడం లేదంటూ ఫిర్యాదులు వస్తుంటాయి ఎక్కువగా. కానీ వాస్తవానికి పరికించి చూస్తే తప్పు పెద్దలదేనని స్పష్టం అవుతుంది. కేవలం కనడం వరకే తమ బాధ్యత అని అనుకుంటే పొరపాటు పడినట్లే. పుట్టినప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు వారికి కుటుంబం అంటే ఏమిటి, పెద్దల పాత్ర ఏమిటి, ఎవరితో ఎలా ఉండాలో నేర్పాల్సింది పూర్తిగా ఆ ఫ్యామిలీని పోషిస్తున్న వారిదేనని , ఇది గుర్తించక పోవడం వల్లనే ఇన్ని అనర్థాలు కలుగుతున్నాయని వెల్లడించారు కవిత తుమ్మలపల్లి. ఉద్యోగ రీత్యా ఒత్తిళ్లు ఉండడం, బయటకు వెళ్లడం , ఇంట్లో ఎవరూ లేక పోవడం, పిల్లలే కాదు ఇంట్లో ఉన్న పెద్దలు కూడా ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నారని , అందుకే వృద్దుల ఆశ్రమాలు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు. వెంటాడుతున్న సమస్యలకు అసలైన మూలం ఏమిటనేది అర్థం చేసుకోకుండా మనుషులను మార్చాలని అనుకోవడం కష్టమైన పని అని పేర్కొన్నారు.
అయితే గతంలో కంటే ఇప్పుడు సైకాలజిస్టులు, థెరపిస్టులు, వైద్యుల సంఖ్య పెరిగింది. చికిత్సలు, సాంత్వన కేంద్రాలు, కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులోకి రావడం మొదలైంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేనంతగా డిమాండ్ వీరికి ఉంటోంది. అయితే మార్పునకు సంబంధించిన శిక్షణ అనేది నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇది కుటుంబం నుంచే మొదలు పెట్టాలి. అక్కడ సరైన రీతిలో గుర్తించి శిక్షణ ఇవ్వడం, అవగాహన కల్పించడం చేస్తే చాలా మటుకు ఇబ్బంది పెట్టి, ప్రమాదకరంగా తయారైన అన్ని సమస్యల నుంచి స్వేచ్ఛ లభించే అవకాశం తప్పకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు కవిత తుమ్మలపల్లి. పేరెంట్స్ కు పిల్లలకు , పెద్దలకు చిన్నారులకు మధ్య బాండింగ్ అనేది ముఖ్యమని, దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఇదే సమయంలో పోర్నోగ్రఫీ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీని బారిన పడిన వారు చాలా మంది ఉన్నారని, కానీ దీనిని నియంత్రించడం ఇప్పుడు చాలా కష్టమైనదిగా పేర్కొన్నారు.
అయితే ఆడపిల్లలు, మహిళలే కాదు యువత కూడా ఎక్కువగా ఇబ్బందులకు గురవుతోందని, వారు కూడా మానసిక పరిపక్వతను అర్థం చేసుకోలేక పోతున్నారని తెలిపారు. యవ్వన సమయంలోనే జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీనికి పేరెంట్సే దగ్గరుండి చూసుకోవాలి. సమయం లేదని సాకులు చెప్పే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే రేపొద్దున మెరుగైన సమాజం కావాలని అనుకుంటే తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబీకులు, పెద్దలతో కూడిన కుటుంబాలే నడుం బిగించాలని స్పష్టం చేశారు కవిత తుమ్మలపల్లి. ఆర్థిక సంబంధాల కంటే మానవ సంబంధాలు అత్యంత ముఖ్యమైనవని గుర్తించాలని సూచించారు. జీవితం విలువైనది. దానిని ఆస్వాదించే కళను అలవర్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది. దానికి నిరంతర పర్యవేక్షణ, సుశిక్షుతులైన ట్రైనర్స్, కౌన్సెలర్స్ సహకారం అత్యంత అవసరం. దీని వల్ల శాశ్వతమైన ఇబ్బందుల నుంచి, కష్టతరంగా మారిన సవాలక్ష సమస్యల నుంచి బయట పడేందుకు దోహదం చేస్తుందని స్పష్టం చేశారు కవిత తుమ్మలపల్లి.








