మరింత సమర్థవంతంగా సేవలు అందించాలి
అమరావతి : అంగన్వాడీ టీచర్లు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో, ICDS ప్రాజెక్ట్ పరిధిలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మరింత సమర్థవంతంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందించే పోషణ, ఆరోగ్య సేవలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు స్మార్ట్ ఫోన్లు ఉపయోగ పడతాయని చెప్పారు కందుల దుర్గేష్.
అలాగే, అంగన్వాడీ కేంద్రాల్లో తక్షణ ఆరోగ్య అవసరాలకు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు మంత్రి. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ, ఆధునిక సాంకేతికతను ప్రజాసేవలోకి తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పూర్తి పారదర్శకత పాలన అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.






