రాయచోటి మదనపల్లిలో కలవడం
అమరావతి : ఏపీ మంత్రివర్గం కీలక సమావేశంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మందిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కంట తడి పెట్టారు. ఆయన బోరున విలపించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న సహచర మంత్రులంతా ఒక్కసారిగా విస్మయానికి లోనయ్యారు. ఏమైందంటూ ఆయనను ఆరా తీశారు. తీరా విషయం గురించి ఆరా తీస్తే తమ జిల్లాలో కీలక ప్రాంతంగా ఉన్న రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేయడంతో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తనకు ఈ జిల్లాతో, ఈ ప్రాంతంతో ఎనలేని అనుబంధం ఉందంటూ పేర్కొన్నారు.
మంత్రివర్గ సమావేశంలో అసాధారణ, అనూహ్య ఘట్టం చోటు చేసుకోవడంతో తట్టుకోలేక పోయారు రాం ప్రసాద్ రెడ్డి. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సీటు నుంచి లేచి వచ్చారు. మంత్రిని ఆప్యాయంగా భుజం తట్టారు. ఆయన ఏడుస్తుంటే ఓదార్చే ప్రయత్నం చేశారు . ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు, రాజంపేటను కడపకు, రైల్వే కోడూరును తిరుపతికి మార్చే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.






