మహిళలకు కూడా హక్కులు ఉంటాయని కామెంట్స్
వెండి తెరపై కదలాడే బొమ్మలకు కూడా స్వేచ్ఛ ఉంటుందని, వాటికి కూడా మనసు అనేది ఉందని, అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుందని చెప్పకనే చెప్పారు సుతిమెత్తగా , సూటిగా నటి రోహిణి. సినీ రంగంలో అత్యంత జనాదరణ పొందిన విలక్షణ నటుల్లో ఒకరు రఘువరన్. తనను పెళ్లి చేసుకుంది. కానీ ఆయన అనుకోకుండా తక్కువ వయసులోనే కాలం చేశారు. ఆనాటి నుంచి నేటి దాకా రోహిణి ఒంటరిగానే పోరాడుతోంది. ఒక నటిగా, మహిళగా, భార్యగా, తల్లిగా, వక్తగా, రచయిత్రిగా , సామాజిక బాధ్యత కలిగిన కార్యకర్తగా భిన్నమైన పాత్రలను పోషిస్తూనే ఉంది. తాజాగా విశాఖ వేదికగా జరిగిన శ్రామిక్ ఉత్సవ్ లో పాల్గొన్న రోహిణి తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియ చేసింది. ఈ దేశంలో ప్రత్యేకించి ఈ సమాజంలో మహిళల పట్ల, యువతుల పట్ల, బాలికల పట్ల కొనసాగుతున్న ఆంక్షలు, వివక్షను బహిరంగంగానే వెల్లడించింది. ఒక రకంగా ధిక్కార స్వరాన్ని వినిపించింది. ప్రత్యేకించి స్త్రీల వస్త్రధారణపై జరుగుతున్న రాద్దాంతంపై కూడా స్పందించింది. నిర్భయంగా తన వాయిస్ ను వినిపించింది. ఇప్పుడు సంప్రదాయ వాదుల ముసుగు వేసుకున్న వారి కంట్లో నలుసుగా మారింది నటి రోహిణి.
ఇదే సమయంలో తనను తాను తెలుసుకునేందుకు, తాను మారేందుకు పెరియార్ , అంబేద్కర్ ల ఆలోచన విధానం దోహద పడిందని చెప్పింది. పురుషులకు ఉన్న వెసులుబాట్లు, ఆధిపత్య ధోరణి స్త్రీలకు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించింది. ప్రశ్నించే స్వభావం అనేది చదువు కోవడం వల్ల వస్తుందని , దాని కారణంగానే మనం మనుషులుగా మరింత ఎదిగేందుకు దోహద పడుతుందని స్పష్టం చేసింది రోహిణి. పాతబడిన భావాలను, పాతబడిన ఆలోచనలను వదిలేయాలని, కొందరు సంప్రదాయం అనే ముసుగు తొడుగుకుని, అందమైన పేరుతో వీటిని కాపాడటానికి వస్తారని, ఇవి కేవలం మహిళలను అణచి వేయడానికి, సమాజంలోని కొన్ని వర్గాలను అడ్డుకోవడానికి ఉద్దేశించినవి తప్ప, మానవ ప్రగతికి సహాయపడటానికి కాదని కుండ బద్దలు కొట్టింది రోహిణి. స్త్రీలు, పురుషులు వేర్వేరు కాదు ఇద్దరూ ఒక్కటే. శారీరక పరంగా కొన్ని మార్పులు ఉంటాయి. అలాగని వివక్ష ప్రదర్శిస్తే ఎలా అని నిలదీసింది.
మహిళలు కూడా మనుషులేనన్న స్పృహ రావాల్సిన అవసరం ఉంది. మతం పేరుతో, కులం పేరుతో కొట్టుకు చావడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని, మెరుగైన సమాజం మరుగున పడి పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది రోహిణి. వస్త్రధారణ అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఉంటుంది. దుస్తులు కప్పు కోవడానికే తప్ప విప్పి చూపించడానికో లేదా దానినే గుర్తింపుగా మార్చు కోవడానికో కాదని స్పష్టం చేసింది. ఏది ఏమైనా రోహిణి లేవ దీసిన ప్రశ్నలు ఇప్పుడు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. చచ్చు బడి పోయిన మెదళ్లను తొలుస్తున్నాయి. నటి రోహిణి అభిప్రాయాలతో కొందరు ఏకీభవించక పోవచ్చు. కానీ ఆమె సమాజాన్ని ప్రశ్నించిన తీరుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మరిచి పోవద్దు.








