వంగా సందీప్ రెడ్డి సంచలన ప్రకటన
ముంబై : దమ్మున్న డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. తను ఏది అనుకుంటే దానిని ఆచరణలో పెడతాడు. కచ్చితంగా అనుకున్నది చేసి చూపిస్తాడు. అందుకే ఏ ప్రాజెక్టు చేపట్టినా దానికి వంద శాతం న్యాయం చేయాలని చూస్తాడు. తను ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒక రకంగా విజయ్ దేవరకొండ ను అర్జున్ రెడ్డితో స్టార్ హీరోను చేశాడు. షాహీద్ కపూర్ తో మూవీ తీసి బ్లాక్ బస్టర్ చేశాడు. ఇదే సమయంలో రణ దీర్ కపూర్ తో యానిమల్ తీశాడు అది బాలీవుడ్ ను షేక్ చేసింది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో స్పిరిట్ తీస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే కొత్త సంవత్సరం సందర్బంగా కేవలం సినిమాకు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
తాజాగా శనివారం సంచలన ప్రకటన చేశాడు. తాను తీస్తున్న స్పిరిట్ ను వచ్చే 2027 సంవత్సరం మార్చి 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తానని వెల్లడించాడు. ఇక వంగా గురించి ఎంత చెప్పినా తక్కువే. తీవ్రమైన యాక్షన్, గాఢమైన భావోద్వేగాలు, సహజమైన శక్తిని మిళితం చేసే తన ప్రత్యేక శైలికి పేరుగాంచాడు. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాతో ఒక ఉత్కంఠ భరితమైన సినిమా అనుభవాన్ని అందిస్తానని వాగ్దానం చేశాడు. త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్‌తో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం, ‘స్పిరిట్’ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ, ‘స్పిరిట్’ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు చైనీస్, జపనీస్ , కొరియన్ భాషలలో కూడా భారీగా విడుదల కానుంది.





