వైసీపీ లీగల్ అడ్వయిజర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
అమరావతి : రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, అధికారం ఉంది కదా అని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ లీగల్ అడ్వయిజర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. తన న్యాయ పరమైన కెరీర్ లో ఒక వ్యక్తిపై పెద్ద ఎత్తున కేసులను నమోదు చేయడం చూడలేదన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏకంగా 38 అక్రమ కేసులను బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రజా పాలన సాగిస్తున్నామంటూ మరో వైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేశారని ధ్వజమెత్తారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే దాడులకు ఉసిగొల్పుతోందని ఆరోపించారు. కూటమి పాలనలో బాధతులు జైల్లో ఉన్నారని, కానీ అసలైన నిందితులు బయట దర్జాగా తిరుగుతున్నారని వాపోయారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కక్షతో రెండు రోజుల్లో 36 కేసులు పెట్టించారని , ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని నిలదీశారు రాష్ట్ర కూటమి సర్కార్ ను. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..ఒక్క మనిషి మీద ఇన్ని కేసులు పెట్టడం అని అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చట్టాన్ని లెక్కచేయని పోలీసులకు తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు.






